దేవదాస్ కనకాల మృతి: ప్రముఖుల సంతాపం, అంత్యక్రియలు పూర్తి…

2:02 am, Sun, 4 August 19
devadas-kanakala-death-chiranjeevi

హైదరాబాద్: నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు పలువురు ఆయన నివాసానికి విచ్చేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ కనకాల హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.  శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

చదవండి: యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో తీవ్ర విషాదం!

1945 జులై 30న యానాంలోని కనకాలపేటలో పాపయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించిన దేవదాస్ కనకాల వందకు పైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌ని తెరకెక్కించారు.

కుటుంబ సభ్యులకు చిరంజీవి పరామర్శ…

దేవదాస్ కనకాల మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయాన్ని సందర్శంచి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు దేవదాస్ కనకాలకి నివాళులు అర్పించారు.

దేవదాస్ కనకాల అనారోగ్యానికి కారణమేంటి? ఆయన ఎన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు? అనే విషయాలను చిరంజీవి ఆయన కుమారుడు రాజీవ్ కనకాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాల రూపంలో ఎప్పుడూ జీవించే ఉంటారు అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అంత్యక్రియలు పూర్తి…

మరోవైపు శనివారం హైదరాబాద్ మహాప్రస్థానంలో దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన తండ్రి భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.