పుల్వామా ఉగ్రదాడి: ఇప్పడు కూడా శాంతి, అహింస అనేవాళ్ల చెంప పగలగొట్టండి: గర్జించిన ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’!

11:25 am, Sat, 16 February 19
Kangana-Ranaut

Kangana-Ranaut

ముంబై:  ప్రస్తుతం దేశం మొత్తం పుల్వామా ఘటన‌పై అట్టుడుకుతోంది. ‘‘ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి..’’ అని వ్యాఖ్యానించారు నటి కంగనా రనౌత్‌. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది.

ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచ దేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్‌ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు.

‘‘మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు…’’

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ..”పాక్‌ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేలి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు..” అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ …”మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలి..”  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జవాన్ల మృతికి సంతాపంగా కంగనా తన ‘మణికర్ణిక’ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు.