27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆపరేషన్ కమలం: కష్టాల్లో కమల్‌నాథ్ సర్కార్…

ఆపరేషన్ కమలం: కష్టాల్లో కమల్‌నాథ్ సర్కార్…

- Advertisement -

భోపాల్: గతేడాది డిసెంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకుగానూ 114 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది.

అయితే మ్యాజిక్ ఫిగర్‌ 116కు రెండు స్థానాలు తక్కువ కావడంతో…ఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.

ఇక అప్పటి నుంచి కమలం పార్టీ నేతలు కమల్‌నాథ్ సర్కారులోని ఎమ్మెల్యేలని తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 29 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించగా…కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికి పరిమితమయ్యింది.

దీంతో బీజేపీ ఆపరేషన్ కమలం’ని ఉదృతం చేసింది. కమల్‌నాథ్ సర్కారుకు దినదినగండంగా మారింది. ప్రభుత్వం కూలిపోతుందన్న భయం సీఎం కమల్‌నాథ్‌ను వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరూ చేజారిపోకుండా ఆయన దృష్టిసారించారు.

అలాగే ఎమ్మెల్యేలు ఎవరూ చేజారిపోకుండా చూసుకోవాలని మంత్రులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా…ఒక్కో మంత్రి ఐదుగురు ఎమ్మెల్యేలపై దృష్టిసారించాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం.

ఇక ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా 27 మంది మంత్రులదేనని సీఎం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని ఆరోపిస్తున్న బీజేపీ…ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి మెజార్టీ నిరూపించుకునేలా కమల్‌నాథ్‌కు ఆదేశాలివ్వాలంటూ గవర్నర్‌కు గత వారం లేఖరాసిన విషయం తెల్సిందే.

చందవండి: లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: రాజీనామాని వెనక్కి తీసుకునేందుకు రాహుల్ నిరాకరణ….

 

- Advertisement -