చంద్రయాన్-2: మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న‘విక్రమ్’ ల్యాండర్…

10:03 pm, Fri, 6 September 19
chandrayaan-2-vikram-rover-moon-landing

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన చంద్రయాన్-2 చరమాంకానికి చేరువైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రయాన్-2కి చెందిన ల్యాండర్ ‘విక్రమ్’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపనుంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. రాత్రి 1.30 – 2.30 గంటల ప్రాంతంలో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్ అనే రెండు చంద్రబిలాల మధ్య ‘విక్రమ్’ ల్యాండర్ దిగుతుంది. ఈ అద్భుతం కోసం భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ఇలా…

ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా.

సరిగ్గా చంద్రుడి ఉపరితలంపై ‘విక్రమ్’ ల్యాండర్ కాలు మోపే సమయంలో అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో చంద్రయాన్-2 వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల ద్వారా బ్యాటరీలు రీఛార్జి అవుతాయి.

చదవండి: చంద్రయాన్-2 టైమ్‌లైన్: అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు…

ఈలోగా ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుడు లేని.. సమతలంగా ఉండే స్థలాన్ని అన్వేషిస్తారు. ఒకవేళ ‘విక్రమ్’ ల్యాండర్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరన ఉండే ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి.. అక్కడ సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు.

ఆ తరువాత ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్ల స్థాయికి తగ్గించినెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని ‘విక్రమ్’ ల్యాండర్ తాకేలా చేస్తారు. దీనికి దాదాపు 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయం, ప్రక్రియ.. రెండూ చంద్రయాన్-2 ప్రయోగానికే ఆయువుపట్టు వంటివి. అందుకే దీనిని ఇస్రో ఛైర్మన్ శివన్ ‘15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌’గా అభివర్ణించారు.

ఆ 15 నిమిషాలు అత్యంత కీలకం…

చంద్రయాన్-2లో భాగమైన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే ఆ 15 నిమిషాలు ఈ ప్రయోగంలో అత్యంత కీలకమే కాదు, అత్యంత కష్టతరం కూడా.

ఎందుకంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా కొంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుని 35X100 మీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఇది మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే చంద్రుడి ఆకర్షణ శక్తికి లోనై అమిత వేగంతో దూసుకెళ్లి చంద్రుడిపై కూలిపోతుంది.

అలా జరగకుండా ‘విక్రమ్’ ల్యాండర్‌ను అతి తక్కువ వేగంతో చంద్రుడి ఉపరితలంపై మెల్లమెల్లగా దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ల్యాండర్‌కు అనుసంధానమై ఉండే డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా దాని వేగాన్ని నియంత్రిస్తూ నెమ్మదిగా ల్యాండర్ దిగేలా ఏర్పాట్లు చేశారు.

దీనినే ‘సాఫ్ట్ ల్యాండింగ్’గా పిలుస్తున్నారు. ఈ విధంగా ల్యాండర్‌ను చంద్రుడిపై దింపిన ఘనత ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు గనుక చంద్రయాన్-2కు సంబంధించిన ‘విక్రమ్’ ల్యాండర్ కూడా ఈ రకమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే.. భారత్ ఈ ఘనత సాధించిన నాలుగో దేశం అవుతుంది.

ఎంత సాఫ్ట్ ల్యాండింగ్ అయినా.. ఆ సమయంలో చంద్రుడి ఊపరితలంపై విపరీతమైన ధూళి పైకి లేస్తుంది. ఇలా లేచిన ధూళి కణాలు తిరిగి సర్దుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత ఉదయం 5.30 – 6.30 గంటల మధ్య ‘విక్రమ్’ ల్యాండర్ నుంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ మెల్లగా బయటికి వస్తుంది.

27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగిన ‘ప్రజ్ఞాన్’ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తిరుగుతూ దాదాపు 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తూ.. ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని విక్రమ్ ల్యాండర్ ద్వారా బైలాలులోని ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు పంపుతుంది.

ల్యాండింగ్ ప్రక్రియను తిలకించనున్న ప్రధాని మోడీ…

ఈ ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని నరేంద్రమోడీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు.

అలాగే దేశవ్యాప్తంగా 9, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్ధులను కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇప్పటికే ఇస్రో ఎంపిక చేసింది. వీరంతా ప్రధానితో కలిసి చంద్రయాన్-2లో భాగమైన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగడాన్ని వీక్షిస్తారు.

చంద్రయాన్ 2 అరుదైన క్షణాలను వీక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

నేడు కీలక కక్ష్యలోకి చంద్రయాన్-2.. ఆర్బిటర్ నుంచి వేరుకానున్న ‘విక్రమ్’
చంద్రుడి మూడో కక్ష్యలోకి చంద్రయాన్-2
చంద్రయాన్-2 దూరాన్ని 4,412 కిలోమీటర్లు తగ్గించిన ఇస్రో