చంద్రయాన్-2 టైమ్‌లైన్: అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు…

isro-chandrayaan-2
- Advertisement -

బెంగళూరు: మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం చోటుచేసుకోబోతోంది. భారత్ సగర్వంగా ప్రపంచ దేశాలవైపు చూడబోతోంది. ఎందుకంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-2 మరికొద్ది గంటల్లో చరిత్ర సృష్టించబోతోంది.

అన్నీ సవ్యంగా జరిగితే.. ఈ (సెప్టెంబర్ 7 శనివారం) తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్-2లో భాగమైన ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా దిగనుంది.

ఆ తరువాత కొన్ని గంటలకు అందులోని ‘ప్రగ్యాన్’ రోవర్ బయటికి వచ్చి నిర్దేశిత పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

చంద్రయాన్-2 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత పదేళ్లుగా శ్రమిస్తోంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇటు భారత్‌కు అటు మానవాళికి ఎంతో మేలు కలుగుతుంది. 2008లో ఈ ప్రాజెక్టుకు విత్తనం వేశారు. ముందుగా అనుమతులతో ప్రారంభమైన చంద్రయాన్-2 ప్రాజెక్టు ప్రయాణం 2019 వరకు నిరంతరంగా సాగింది.

ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ ఒక స్థాయిలో ఉంది. చంద్రయాన్-1తో చంద్రుడిపై నీటి జాడలను పసిగట్టి ప్రపంచానికి తెలియజెప్పింది. ఇప్పుడు చంద్రయాన్-2 విజయవంతమైతే మన దేశం‌.. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనాల సరసన నిలుస్తుంది.

ఈ నేపథ్యంలో.. ‘చంద్రయాన్‌-2’కు సంబంధించి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు.. మీకోసం.

చంద్రయాన్-2 ప్రయోగంలో ఏమేం ఇమిడి ఉన్నాయంటే…

1. లాంచ్ వెహికల్ (చంద్రయాన్-2ను మోసుకెళ్లిన రాకెట్)
2. ల్యాండర్ విక్రమ్
3. రోవర్ ప్రగ్యాన్
4. ఆర్బిటర్ (చంద్రుని చుట్టూ పరిభ్రమించేది)
5. సాప్ట్ ల్యాండింగ్
6. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్?

1. లాంచ్ వెహికల్:

చంద్రయాన్-2 జీఎస్ఎల్వీ మాక్-3 రాకెట్ ద్వారా చంద్రుడిపైకి బయల్దేరింది. ఈ రాకెట్‌ను ఇస్రో భారత దేశ ‘బాహుబలి’గా పేర్కొంటోంది. ఎందుకంటే, ఈ రాకెట్‌ తయారీలో వినియోగించిన టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవి.

2. ల్యాండర్ విక్రమ్:

చంద్రయాన్-2లో భాగమైన ల్యాండర్‌కు ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్మృత్యర్థం ‘విక్రమ్’ అని నామకరణం చేశారు. దాదాపు 1500 కిలోల బరువుండే ఈ ల్యాండర్‌లోనే.. ప్రగ్యాన్ అనే రోవర్ కూడా ఇమిడి ఉంటుంది.

సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ద్వారా చంద్రుడి ఉపరితలంపై దిగే ఈ విక్రమ్ ల్యాండర్.. ఆ తరువాత ఇటు ఆర్బిటర్, అటు ప్రగ్యాన్ రోవర్లతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తూ ఇస్రో నిర్దేశించిన పరిశోధనల్లో పాలుపంచుకుంటుంది.

3. రోవర్ ప్రగ్యాన్ :

ల్యాండర్ విక్రమ్ లోంచి బయటికి వచ్చే రోవర్ ప్రగ్యాన్ దాదాపు 27 కిలోల బరువుంటుంది. 6 చక్రాలు కలిగి ఉండి, సౌరశక్తితో పని చేసే ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై అటు ఇటు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది.

చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల దూరం తిరుగాడే ఈ రోవర్ ఎప్పటికప్పుడు తాను సేకరించే సమాచారాన్ని ల్యాండర్ విక్రమ్‌కి అందజేస్తే, విక్రమ్ ఆ సమాచారాన్ని బైలాలులోని ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు పంపిస్తుంది.

4. ఆర్బిటర్:

చంద్రయాన్-2 ప్రయోగంలో భాగమైన ఆర్బిటర్ ఏడాది కాలంపాటు చంద్రుడిపై 100×100 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని ఒక కంట కనిపెడుతూ ఫోటోలు తీస్తూ, భూమి మీదికి సమాచారాన్ని చేరవేస్తుంది.

5. సాఫ్ట్ ల్యాండింగ్ :

ఇస్రో నుంచి ఆదేశాలు అందిన వెంటనే విక్రమ్ ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుంది.

సరిగ్గా చంద్రుడిపై విక్రమ్ కాలు మోపే వేళలలో చంద్రుడిపై సూర్యోదయమవుతుంది. దీంతో వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల సాయంతో బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. ఆ తరువాత ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుడు లేని సమతలంగా ఉండే స్థలాన్ని అన్వేషిస్తారు.

ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దిక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు.

ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. ఈ 15 నిమిషాల ప్రక్రియ చంద్రయాన్-2కే ఆయువుపట్టు వంటిది. అందుకే ఆ సమయాన్ని ఇస్రో ఛైర్మన్ ‘15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌’గా అభివర్ణించారు.

ఆ 15 నిమిషాలకు ఎందుకంత ప్రాధాన్యత?

ఎందుకంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా కొంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుని 35X100 మీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఇది మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే చంద్రుడి ఆకర్షణ శక్తికి లోనై అమిత వేగంతో దూసుకెళ్లి చంద్రుడిపై కూలిపోతుంది.

అలా జరగకుండా ‘విక్రమ్’ ల్యాండర్‌ను అతి తక్కువ వేగంతో చంద్రుడి ఉపరితలంపై మెల్లమెల్లగా దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ల్యాండర్‌కు అనుసంధానమై ఉండే డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా దాని వేగాన్ని నియంత్రిస్తూ నెమ్మదిగా ల్యాండర్ దిగేలా ఏర్పాట్లు చేశారు.

దీనినే ‘సాఫ్ట్ ల్యాండింగ్’గా పిలుస్తున్నారు. ఈ విధంగా ల్యాండర్‌ను చంద్రుడిపై దింపిన ఘనత ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు గనుక చంద్రయాన్-2కు సంబంధించిన ‘విక్రమ్’ ల్యాండర్ కూడా ఈ రకమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే.. భారత్ ఈ ఘనత సాధించిన నాలుగో దేశం అవుతుంది.

ఎంత సాఫ్ట్ ల్యాండింగ్ అయినా.. ఆ సమయంలో చంద్రుడి ఊపరితలంపై విపరీతమైన ధూళి పైకి లేస్తుంది. ఇలా లేచిన ధూళి కణాలు తిరిగి సర్దుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత ఉదయం 5.30 – 6.30 గంటల మధ్య ‘విక్రమ్’ ల్యాండర్ నుంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ మెల్లగా బయటికి వస్తుంది.

6. దక్షిణ ధ్రువంపైనే దిగడం ఎందుకు?

చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను దింపడానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది.. ల్యాండింగ్ సమయంలో అక్కడ సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో సౌరశక్తి అధికంగా లభింస్తుంది. ఫలితంగా చంద్రయాన్-2 లోని పరికరాలు పనిచేయడానికి వేరే ఇంధనాన్నో లేదా బ్యాటరీలనో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు.

రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు రాళ్లు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ల్యాండర్ విక్రమ్‌ను అతి మెల్లగా(సాఫ్ట్ ల్యాండింగ్) దించేందుకు ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంటుంది.

మరో కారణమేంటంటే.. చంద్రుడిపై ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ ధ్రువం ప్రాంతంలో నీటి ఆనవాళ్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరూ దిగని ఈ ప్రాంతంలో దిగి పరిశోధనలు జరిపితే ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందనేది ఇస్రో శాస్త్రవేత్తల ఆలోచన.

క్లుప్తంగా ఇదీ ప్రయోగం…

చంద్రయాన్-2 చంద్రుడిపైకి భారత్ పంపిన రెండవ మిషన్. 2008లో చంద్రయాన్-1 పేరిట తొలి జాబిల్లి యాత్రను ఇస్రో విజయవంతంగా చేపట్టి చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొని సంచలం సృష్టించింది.

జులై నెల 22వ తేదీన చంద్రయాన్-2ను మోసుకుంటూ జీఎస్ఎల్వీ మాక్ 3 రాకెట్ నింగిలోకి ఎగిసింది. ఈ ప్రయోగం ప్రారంభమైన 48 రోజుల తరువాత సెప్టెంబర్ 7న ఈ లాండర్, రోవర్లు చంద్రుడిపై దిగనున్నాయి.

చంద్రుడిపై దిగనున్నభారతదేశ మొట్టమొదటి మూన్ ల్యాండర్ విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 – 2.30 గంటల మధ్య దిగనుంది.

చంద్రుడిపై దిగిన 4 గంటల తరువాత లాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రగ్యాన్ వేరవుతుంది. ఇలా బయటకొచ్చిన ప్రగ్యాన్ 14 రోజులపాటు చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల దూరం సంచరిస్తూ అనేక పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. 

 

- Advertisement -