చివరి క్షణంలో నిరాశ.. జాబిల్లిని ముద్దాడే సమయంలో ఆగిన సంకేతాలు

7:07 am, Sat, 7 September 19
chandrayaan-2-vikram-rover-moon-landing

బెంగళూరు: జూలై 22న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందనుకున్న దశలో సాంకేతిక సమస్య తలెత్తింది.

జాబిల్లికి పైకి విక్రమ్ ల్యాండర్ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా సంకేతాలు ఆగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో నిర్వేదం నిండుకుంది. మరో నిమిషం గడిచినట్లయితే ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం అయి ఉండేది.

చివరి నిమిషంలో…

అయితే అంతలోనే భూమికి, ల్యాండర్‌కు మధ్యనున్న సంబంధాలు తెగిపోయాయి. అకస్మాత్తుగా సిగ్నల్స్ ఆగిపోవడంతో శాస్త్రేవేత్తలు నిరాశలో మునిగిపోయారు. మొదటినుంచీ శాస్త్రవేత్తలు ఈ చివరి 15 నిమిషాల ల్యాండింగ్ ప్రక్రియను ఎంతో క్లిష్టమైనదిగా చెబుతూనే వస్తున్నారు.

అయితే ఆ చివరి 15 నిమిషాల వ్యవధిలో కూడా 14 నిమిషాలు విజయవంతంగా పూర్తయ్యాయి.  ల్యాండర్ ‘విక్రమ్’ మరో నిమిషంలో జాబిల్లిని ముద్దాడుతుందనగా సమస్య మొదలైంది.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. చంద్రుడి కక్ష్య నుంచి గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపైకి దూసుకొస్తున్న విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తొలుత వారు విజయవంతంగా తగ్గించగలిగారు. ఈ ‘రఫ్ బ్రేకింగ్’ దశ విజయవంతమైంది.

జాబిల్లికి 2.1 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాక…

మరో పది నిమిషాల తర్వాత ‘ఫైన్ బ్రేకింగ్’ దశ కూడా విజయవంతమైంది. జాబిల్లికి.. విక్రమ్ ల్యాండర్‌కు మధ్య గల దూరం 2.1 కిలోమీటర్ల ఉందనగా సమస్య మొదలైంది. హఠాత్తుగా ల్యాండర్ ‘విక్రమ్’ నుంచి భూమ్మీదికి వస్తోన్న సంకేతాలు నిలిచిపోయాయి.

దీంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్)లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని, సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.శివన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

2.1 కిలోమీటర్ల వరకు అంతా సవ్యంగానే సాగిందని, ఆ తర్వాతే సమస్య తలెత్తిందని శివన్ ఆ పేర్కొన్నారు.