తీహార్ జైలులో చిదంబరం తొలిరోజు: 6 దుప్పట్లు, ఫ్యాను, వెస్ట్రన్ టాయిలెట్.. రాత్రంతా జాగారం..

chidambaram-in-tihar-jail
- Advertisement -

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జైలుపాలైన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన్ని తీహర్ జైలుకు తరలించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన జైలులోనే ఉంటారు.

ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న తరువాత చిదంబరం.. తొలిసారి జైలుపాలయ్యారు. ఇప్పటివరకూ ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారించారు. తాజాగా- కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు.

అయితే చిదంబరంను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించరాదంటూ ఆయన తరపున వాదించిన న్యాయవాది కపిల్ సిబల్ చివరి వరకూ కోర్టును అభ్యర్థించారు. ఒకవేళ జ్యుడీషియల్ కస్టడీ అనివార్యం అయిన పక్షంలో జైలులో చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించాలని, వెస్ట్ర్నన్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని.. ఇంకా మరికొన్ని కోరికలు కోరారాయన.

జైలులో ప్రత్యేక గది…

గురువారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు అప్పగించారు. జైలులో.. చిదంబరానికి ఏడో నంబర్ బ్యారక్‌లోని అయిదో నంబర్ సెల్‌లో ఆయన్ని ఉంచారు. సాధారణంగా ఏడో నంబర్ బ్యారక్‌లోని జైలు గదుల్లో ముగ్గురు నేరస్తులను ఉంచుతారు. అయితే చిదంబరానికి జెడ్ కేటగిరీ భద్రత ఉండటం దృష్ట్యా ఆయన ఒక్కరినే ఒక సెల్ లో ఉంచారు.

గతంలో ఇదే కేసులో ఆయన తనయుడు కార్తీ చిదంబరం అరెస్టయినప్పుడు కూడా ఇదే ఏడో నంబర్ బ్యారక్‌లోనే 12 రోజులు గడిపారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేకంగా ఒక గది, వెస్ట్రన్ టాయిలెట్ కేటాయించామని అంతకుమించి ఎలాంటి సదుపాయాలు లేవని అధికారులు తెలిపారు.

పోతే, అవసరమైన మందులను వెంట తెచ్చుకోవడానికి ఆయనకు అనుమతి ఇచ్చామని, అలాగే ఆయన అక్కడ ఉన్నన్ని రోజులూ.. రోజుకు పదిమంది చొప్పున ఆయనను కలుసుకోవడానికి అనుమతి ఉందని వారు పేర్కొన్నారు.

రాత్రంతా జాగారం…

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టైన తరువాత తొలిసారిగా జైలుజీవితాన్ని ఎదుర్కోవలసి రావడం, అది కూడా కరుడుగట్టిన నేరస్తులను ఉంచే తీహార్ జైలు కావడంతో.. చిదంబరం తీవ్ర ఆందోళనకు గురైనట్లు కనిపించారు.

దీంతో గురువారం రాత్రంతా ఆయన కంటిమీద కునుకు లేకుండా జాగారం చేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కొద్దిసేపు ఆయన కునుకుతీసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.

చిదంబరం వయస్సును దృష్టిలో ఉంచుకుని నిద్రించడానికి వీలుగా ఆయనకు మంచాన్ని ఏర్పాటు చేశారు. ఆరు దుప్పట్లను అందజేశారు. టేబుల్ ఫ్యాన్‌తోపాటు ఆయన కోరిన విధంగా వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించారు.

ఉదయం వాకింగ్, అల్పాహారంగా…

గురువారం రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయలతో డిన్నర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం ఉదయం మాత్రం ఆయన కాసేపు వాకింగ్ చేశారని, ఆ తరువాత కేవలం టీ, ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకున్నారట. ఆయనకు ప్రత్యేక ఆహారం ఏమీ అందించడం లేదని, ఖైదీలందరికీ వడ్డించే భోజనాన్నే చిదంబరానికి కూడా వడ్డిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

- Advertisement -