34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఐఎన్ఎక్స్ మీడియా కేసు: షాకిచ్చిన కోర్టు.. తీహార్ జైలుకు చిదంబరం! ఎవరి వాదన ఏమిటంటే…

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: షాకిచ్చిన కోర్టు.. తీహార్ జైలుకు చిదంబరం! ఎవరి వాదన ఏమిటంటే…

chidambaram-for-judicial-custody
- Advertisement -

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ కస్టడీ ముగియడంతో చిదంబరంను గురువారం కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ కేసులో వాదనలు విన్నారు. చివరికి చిదంబరంను 14 రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు 21న అరెస్టు చేసినప్పట్నించి గురువారం వరకు అంటే.. 15 రోజులపాటు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అరెస్టు తర్వాత.. సీబీఐ ఆయన్ని మొత్తం ఐదుసార్లు కోర్టులో హాజరుపరిచింది.

‘‘ఈడీకి లొంగిపోతాను..’’

గురువారం విచారణ సందర్భంగా.. తాను ఈడీ అధికారు ముందు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నానని చిదంబరం న్యాయమూర్తికి విన్నవించారు. ఆ రకంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చని ఆయన భావించారు.

అయితే చిదంబరం చాలా పవర్‌పుల్ వ్యక్తి అని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఆయన్ని జైలులోనే ఉంచాలంటూ సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు కూడా ఆ వాదనతో ఏకీభవిస్తూ చిదంబరానికి జ్యూడీషీయల్ కస్టడీ విధించింది.

మరోవైపు చిదంబరం తరుపున తన వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్ సిబల్ సీబీఐ వాదనను తప్పుబట్టారు. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబరం మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఆయన్ని ఈడీ కస్టడీకి అప్పగించాలని వాదించారు.

చిదంబరం విచారణకు భంగం కలగజేసినట్లుగానీ, ఒకరిని ప్రభావితం చేసినట్లుగానీ ఎక్కడా ఆధారాలు లేవని కపిల్ సిబాల్ వాదించారు. పైగా ఈడీ కస్టడీకి వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు.

మరోవైపు చిదంబరం కూడా తన నేరం ఏమిటో సీబీఐ అధికారులు రుజువు చేయలేకపోయారని, కనీసం ఇప్పటి వరకు చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే తాను సాక్షులను ప్రభావితం చేస్తానంటూ సీబీఐ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన జ్యుడీషియల్ కస్టడీ కోసం సీబీఐ చెబుతోన్న కారణాలు సహేతుకంగా లేవని తెలిపారు.

‘‘ఆయన బయట ఉండటం ప్రమాదకరం…’’

ఈ దశలో సొలిసిటర్ జనరల్ మొహతా జోక్యం చేసుకుంటూ.. అసలు చిదంబరం తరుపున వాదనలు దేనికోసం వినిపిస్తున్నారంటూ ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించారు. దీనికి కపిల్ సిబల్ స్పందిస్తూ.. చిదంబరం విడుదల కోసం తాను వాదిస్తున్నట్లు చెప్పారు.

దీంతో సొలిసిటర్ జనరల్ మొహతా మాట్లాడుతూ.. చిదంబరం విచారణకు సహకరించడం లేదని, పైగా ఆయన విదేశీ బ్యాంకులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదేగనుక జరిగితే విచారణలో ఆ బ్యాంకులు సహకరించే పరిస్థితి ఉండదని కోర్టుకు తెలిపారు.

అసలు ఈ కేసును మామూలు నేరంగా చూడరాదని, దేశ ఆర్థిక వ్యవస్థనే పక్కదారి పట్టించిన నేరంగా పరిగణించాలని వాదించారు. అంతేకాకుండా, కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి పేరును రహస్య పద్ధతిలో న్యాయస్థానానికి సమర్పించిన మెహతా… ఆ వ్యక్తి పేరును బహిరంగపరిస్తే.. సదరు వ్యక్తిని చిదంబరం ప్రభావితం చేయగలరని, అందుకే తాము పేరు వెల్లడించడం లేదని న్యాయమూర్తితో చెప్పారు.

ఇరువైపుల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి చివరికి సీబీఐ, సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవిస్తూ.. చిదంబరంను 14 రోజులపాటు.. అంటే.. సెప్టెంబర్ 19 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -