

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీనే మళ్లీ ప్రధాని కావాలంటూ విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం ఆయన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
మోడీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. మోడీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. దీంతో ఆ సమయంలో సభలోనే ఉన్న మోడీ చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ ములాయంకు నమస్కరించారు. కాగా, ములాయం వ్యాఖ్యలతో ఎస్పీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు షాక్‌కు గురయ్యారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో సైతం అఖిలేశ్ జత కట్టారు. అయితే ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
100శాతం మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం: మోడీ
తాము తమ ఐదేళ్ల పాలనలో నూటికి నూరు శాతం దేశ ప్రజల కోసం పనిచేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. చివరి లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్భంగా బుధవారం మోడీ ప్రసంగించారు. స్పీకర్ సమిత్రా మహాజన్ నిర్వహంచిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
‘మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మా ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చాం. నేడు మన దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ గొప్పదనం పెరిగింది’ అని మోడీ వ్యాఖ్యానించారు.
అంతేగాక, ‘మా పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైంది. ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న దేశాలకు ఎంతో సాయం చేశాం. మానవతా దృక్పథంతో పలు దేశాలకు సాయం అందించాం. అవినీతి నిరోధానికి పలు చట్టాలు చేశాం. జీఎస్టీ బిల్లు తెచ్చి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చాం. మా పాలనలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశాం’ అని ప్రధాని వివరించారు. ప్రస్తుత లోక్‌సభలో అనేక సమావేశాలు మంచి ఫలితాలిచ్చాయని, సభలో ప్రస్తుతం ఉన్న సభ్యులంతా మళ్లీ సభకు రావాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.
చదవండి: యూపీఏ కంటే చీప్‌గానే: ఎన్డీఏ ‘రాఫెల్ డీల్’తో 17.08శాతం డబ్బు ఆదా, కాగ్ రిపోర్టులో కీలకాంశాలు








