29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం యూపీఏ కంటే చీప్‌గానే: ఎన్డీఏ ‘రాఫెల్ డీల్‌’తో 17.08శాతం డబ్బు ఆదా, కాగ్ రిపోర్టులో కీలకాంశాలు

యూపీఏ కంటే చీప్‌గానే: ఎన్డీఏ ‘రాఫెల్ డీల్‌’తో 17.08శాతం డబ్బు ఆదా, కాగ్ రిపోర్టులో కీలకాంశాలు

rafale deal: cag report
- Advertisement -

న్యూఢిల్లీ: రఫేల్‌ ఒప్పందం విషయంలో ఎంతో కీలకమైనదిగా భావిస్తున్న కాగ్‌ నివేదికను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో 126 విమానాల కొనుగోలు డీల్‌తో పోల్చుకుంటే కొత్త డీల్‌లో భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం సొమ్ము ఆదా అయ్యిందని కాగ్‌ తన రిపోర్టులో వెల్లడించింది.

పాత డీల్‌తో పోలిస్తే కొత్త డీల్‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్‌కు చేరతాయని తెలిపింది. ఈ ఒప్పందం మొత్తం మీద 2.86శాతం తక్కువ ధరకే జరిగిందని పేర్కొంది. 141 పేజీల కాగ్ రిపోర్టులో 32 పేజీల్లో రాఫెల్ డీల్ వివరాలున్నాయి.

2012 నుంచీ 2017 వరకూ రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఏం జరిగిందో కాగ్ రిపోర్టులో వివరాలున్నాయి. వైమానిక దళం చేస్తున్న 11 కొనుగోళ్ల ఒప్పందాల వివరాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. వాటిలో 5 యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కాగా… ఆరు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకున్నవి.

కాగ్ రిపోర్టులో కీలక అంశాలు..

– రాఫెల్ యుద్ధ విమానాలకు యూపీఏ ప్రభుత్వం ఏ ధర నిర్ణయించిందో, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అంతే ధర నిర్ణయించింది. 2007లో యుద్ధ విమానానికి ఏ ధర ఉందో… 2016లోనూ అదే ధర ఉంది.

– యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే తాము కుదిర్చిన రాఫెల్ డీల్‌లో యుద్ధ విమానాల ధర 9 శాతం తక్కువ అని బీజేపీ ప్రభుత్వం చెప్పినా.. అది నిజం కాదన్న కాగ్.. 2.86 శాతం తక్కువ అని తేల్చింది.

– కొత్త డీల్‌లో భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం మనీ ఆదా అయ్యిందని కాగ్‌ తన రిపోర్టులో తెలిపింది.

– 2015 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం 126 విమానాల కొనుగోలు డీల్‌ను రద్దు చేయాలని పేర్కొంది. ఈ డీల్‌లో దసో అత్యల్ప ధర కోట్‌ చేసిన బిడ్డర్‌ కాదని పేర్కొంది. అదే సమయంలో యూరోపియన్‌ ఏరోనాటిక్స్‌ డిఫెన్స్‌ స్పేస్‌ కంపెనీ కూడా టెండర్‌ అర్హతలను పూర్తిగా చేరుకోలేదని కాగ్‌ పేర్కొంది.

– ఈ ఒప్పందం సందర్భంగా భారత వాయుసేన (ఏఎస్‌క్యూఆర్‌) ఎయిర్‌స్టాఫ్‌ క్వాలిటేటీవ్‌ రిక్వైర్‌మెంట్స్‌ను సరిగా వివరించలేదని కాగ్‌ పేర్కొంది. ఫలితంగా ఏ విక్రేతా ఈ ఏఎస్‌క్యూఆర్‌ను సంతృప్తి పరచలేకపోయిందని వెల్లడించింది.

– కొనుగోళ్ల సమయంలో ఏఎస్‌క్యూఆర్‌ను తరచూ మార్చేసేవారు. ఇది ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సాంకేతిక సామర్థ్యం, ధరలను అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఇది టెండరింగ్‌పై కూడా ప్రభావం చూపింది. ఫలితంగా డీల్‌ చాలా ఆలస్యమైంది. కాగా, సాంకేతిక అంచనాల నివేదికలో ఆబ్జెక్టివిటీ, ఈక్విటీ, నిలకడగా సాంకేతిక పరిశీలన వంటి అంశాలు నివేదికలో లేవు.

సత్యమేవ జయతే అంటూ అరుణ్ జైట్లీ

కాగ్ నివేదిక వెల్లడైన నేపథ్యంలో కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాగ్‌ నివేదిక ద్వారా ప్రతిపక్షాల అబద్దపు ప్రచారం బట్టబయలు అయ్యిందని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. రాఫెల్‌పై కాగ్ ఇచ్చిన నివేదికపై స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. సత్యమేవ జయతే.. నిజం బయటపడిందని ట్వీట్ చేశారు.

2016 vs 2007- తక్కువ ధర, వేగవంతమైన డెలివరీ, మెరుగైన నిర్వహణ. అయినా.. సుప్రీంకోర్టు తప్పు, కాగ్‌ నివేదిక తప్పు.. కేవలం రాజవంశీయులు మాత్రమే కరెక్ట్‌ అంటారంటూ జైట్లీ సెటైర్లు వేశారు. దేశానికి నిత్యం అబద్ధాలు చెబుతున్న వారిని ఏ విధంగా శిక్షించాలి? మహాకూటమి చెబుతున్న అబద్ధాలను కాగ్‌ నివేదిక బట్టబయలు చేసిందని అన్నారు. కాగా, గత కొంత కాలంగా రఫెల్ డీల్ ఓ కుంభకోణమంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాగ్ పేర్కొనడంతో వారి ఆరోపణలన్నీ బుడిదలో పోసిన పన్నీరయ్యాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల ముందు కాగ్ ఇచ్చిన క్లీన్ చిట్ ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా మారింది.

చదవండి: ‘రాహుల్‌కు మతిభ్రమించింది’: ‘రాఫెల్’పై ఇక చెప్పేదేం లేదన్న నిర్మలా సీతారామన్…

- Advertisement -