
ముంబై: భారీ వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల కారణంగా వివిధ ఘటనలలో ఇప్పటి వరకు 35 మంది మరణించినట్లు సమాచారం.
తూర్పు మలాడ్ ప్రాంతంలో వర్షాలకు బాగా తడిసి గుడిసెలపై గోడ కూలిపడిన ఘటనలో 19 మంది మరణించగా.. ఇంకా మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వివిధ ఘటనల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై నగర వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత భారీ వర్షం అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలో చాలాచోట్ల వరదలు వచ్చాయి.
ఫలితంగా రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రజలెవరూ ఇళ్లల్లోంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు.
2017లోనూ ముంబైలో ఇలాగే భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక 2005లో సంభవించిన వరదల్లో అయితే 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ముంబై మహానగరంలో విచ్చలవిడి నిర్మాణాలు, పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో లోపాల వల్లే ఏటా వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిలిచిపోయిన రైలు, విమాన సేవలు…
భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబైకి జీవనాడిగా వర్ణించే సబర్బన్ రైల్వే నెట్వర్క్ సేవలను కూడా చాలా మార్గాల్లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో ఓ విమానం రన్‌వేపై జారిపోయింది. దీంతో, ప్రధాన రన్‌వేను మూసివేశారు.
ఇక మంగళవారం నాటికి సుమారు 50 విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. మరో 50కి పైగా విమానాలు రద్దయ్యాయి. రెండో రన్‌వే నడుస్తున్నా, విమాన సర్వీసులు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశాలున్నాయి.
జలాశయానికి గండి – ఏడుగురి మృతి, 20 మంది గల్లంతు
మహారాష్ట్రలోని రత్నగిరితోపాటు తీర ప్రాంతంలో చాలాచోట్ల నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొంకణ్ ప్రాంతంలోని ఓ ఆనకట్టకు భారీ గండి పడటంతో 23 మంది కొట్టుకు పోయారు. వారంతా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంతవరకు 13 మంది మృతదేహాలను వెలికి తీశారు.
అలాగే రత్నగిరి జిల్లా చీప్లూన్ తాలుకాలోని 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటినిల్వ సామర్థ్యం కలిగిన తివరే ఆనకట్టకు గండి పడింది. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జలాశయం నుంచి నీరు పొంగడంతో ఆ తరువాత గంటకే గండి పడింది. దీంతో ఆ జలప్రవాహం ధాటికి మొత్తం ఏడు గ్రామాలకు భారీ వరదలు వచ్చాయి.
దీంతో ఓ పల్లెటూరులో 12కు పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతయ్యారు. ఈ ఊరు ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ, గాలింపు చర్యలు ప్రారంభించాయి. పరీవాహక ప్రాంతంలోని ఓ కయ్యలో ఈ ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా ముంబైతోపాటు పూణె, కల్యాణ్ ప్రాంతాల్లోనూ తడిసిన గోడలు కూలి పలువురు మృత్యువాత పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మలాడ్‌లో గోడ కూలిన ఘటనలో మరణించిన వారంతా భవన నిర్మాణ కూలీలని తెలుస్తోంది.
మరో రెండు మూడు రోజులు ఇంతే…
మహారాష్ట్రలో ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. బుధ, గురు, శుక్రవారాల్లోనూ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.








