
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతమణి తాలూకా బ్యార్లహల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం.. ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించగా దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చింతమణి నుండి మరుగుమల్లకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేట్ బస్సు కోలార్ నుండి చిక్‌బళ్లాపూర్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన టాటా ఏస్‌లో 25 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరగ్గానే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
చిక్‌బళ్లాపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్, ఎస్పీ సంతోష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చింతమణి, కోలార్‌లోని ఆసుపత్రులకు తరలించారు.








