విమాన ప్రయాణికులకు త్వరలో పెద్ద ఊరట! తగ్గనున్న టిక్కెట్ క్యాన్సిలేషన్‌ చార్జీలు!!

- Advertisement -
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది. విమానయాన సంస్థలు ఎడాపెడా చేస్తోన్న టిక్కెట్ క్యాన్సిలేషన్‌ (రద్దు) చార్జీలకు త్వరలో తెరపడనుంది. తాజా నిబంధనల ప్రకారం.. టిక్కెట్ బుక్‌ చేసిన 24 గంటల్లో ప్రయాణం రద్దు చేసుకున్న ప్రయాణికులకు విమానయాన సంస్థలు టిక్కెట్ పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ బుక్‌ చేసుకున్న టికెట్‌ని 24 గంటల్లో రద్దు చేసుకుని, 96 గంటల తర్వాత మళ్లీ ప్రయాణించాలనుకుంటే అదనపు చార్జీలు లేకుండా అలాంటి ప్రయాణికులకు విమానయాన సంస్థలు టిక్కెట్లు కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా ఇందుకు సంబంధించిన ముసాయిదా విమాన ప్రయాణికుల చార్టర్‌ను విడుదల చేశారు.
అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయనున్నారు. అంతేకాదు, టిక్కెట్ల రద్దు చార్జీలు.. బేసిక్‌ ఫేర్‌, ఫ్యూయల్‌ సర్‌చార్జ్‌ కంటే ఎక్కువగా ఉండకూడదని కూడా ఈ ముసాయిదా చార్టర్‌ చెబుతోంది. ఈ టిక్కెట్ క్యాన్సిలేషన్ చార్జీల గురించి విమాన ప్రయాణికులు ఎప్పట్నుంచో గగ్గోలు పెడుతున్నారు.  బుక్‌ చేసుకున్న టిక్కెట్లను ఏ కారణంతోనైనా రద్దు చేసుకుంటే విమానయాన సంస్థలు వివిధ పేర్లతో అడ్డగోలుగా కోతలు పెడుతూ అతి తక్కువ మొత్తం చెల్లిస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు జారీ చేయాలని నిర్ణయించింది. దీనికితోడు ఏదైనా విమాన సర్వీసు రద్దయినా లేదా నాలుగు గంటల కంటే ఆలస్యమైనా ప్రయాణికులకు పూర్తి టిక్కెట్ చార్జీలు చెల్లించాలని కూడా సదరు ముసాయిదా చార్టర్‌లో పేర్కొన్నారు.
- Advertisement -