వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గూఢచార సంస్థ అమెరికాకు చెందిన సి.ఐ.ఎ. అలాంటి సి.ఐ.ఎ.కి ఇప్పుడు అధిపతి ఓ మహిళ. అవును, అమెరికా ఇంటెలిజన్స్ మొత్తం ఇప్పుడు 62 ఏళ్ల మహిళ గీనా హాస్పెల్ చేతుల్లోకి ఉంది. తీవ్రవాదులను హింసించే రహస్య జైళ్ల గూఢచారిగా వృత్తిలోకి అడుగుపెట్టిన గీనా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతిష్ఠాత్మకమైన ‘సి.ఐ.ఎ డైరెక్టర్’ స్థాయికి చేరుకున్న వైనం ఆద్యంతం ఆసక్తికరం!
అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన గీనా హాస్పెల్ ముప్పై ఏళ్లుగా సి.ఐ.ఎ.లో పని చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెను ‘సిఐఎ డైరెక్టర్’ పదవికి ఎంపిక చేసే ముందువరకూ గీనా గురించి అమెరికన్లకుగానీ, సెనేటర్లకుగానీ పెద్దగా తెలియదు. ఇందుకు కారణం.. ఆమె సి.ఐ.ఎ. రహస్య కార్యకలాపాల్లో వృత్తిబాధ్యతలు నిర్వహించడమే!
గీనా హాస్పెల్ 1985లోనే సి.ఐ.ఎలోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో సి.ఐ.ఎ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసినా, తర్వాత విదేశాల్లో అండర్‌కవర్ కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు నిర్వహించింది. ‘క్లాడెస్టైన్ నేషనల్ సర్వీస్’కు కూడా పూర్వం ఆమె డైరెక్టర్‌గా పని చేసింది. ప్రస్తుత పదవికి ముందు గీనా ‘కౌంటర్ టెర్రరిజం సెంటర్’లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేసింది. తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో అందించిన సేవలకుగాను ఆమెకు ‘ఇంటెలిజెన్స్ మెడల్ ఆఫ్ మెరిట్, ప్రెసిడెన్షియల్ ర్యాంక్ అవార్డు, జార్జ్ హెచ్.డబ్ల్యు. బుష్ అవార్డులు దక్కాయి.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్ సి) నుంచి 21 ఏప్రిల్ 2005లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (సిఐఏ)గా ఏర్పడిన తర్వాత ఈ విభాగానికి ఎంపికైన తొలి మహిళా డైరెక్టర్ గీనా హాస్పెల్. 2005 జార్జ్‌బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ దాకా ఎనిమిది మంది ‘సిఐఏ’ డైరెక్టర్లుగా పనిచేశారు. వీరిలో మైక్ పొంపియోను ట్రంప్ తన టీమ్‌లోకి సెక్రటరీగా తీసుకోవడంతో ఆయన స్థానంలో గీనా తొమ్మిదవ (తొలి మహిళ) డైరెక్టర్‌గా ఎంపికయ్యింది. ఇకనుంచి అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ‘ఇంటెలిజెన్స్’ వ్యవస్థ ఆమె ఆధ్వర్యంలో పనిచేస్తుంది.