25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆనందంగా ఉంది‌: అభినందన్, తల్లిదండ్రుల భావోద్వేగం, యుద్ధ ఖైదీగా పేర్కొన్న పాక్

ఆనందంగా ఉంది‌: అభినందన్, తల్లిదండ్రుల భావోద్వేగం, యుద్ధ ఖైదీగా పేర్కొన్న పాక్

Abhinandan-Varthaman
- Advertisement -

Abhinandan-Varthamanఢిల్లీ: శత్రుదేశంలో మూడు రోజులపాటు నిర్బంధంలో ఉన్నా.. ఏ మాత్రం బెదరకుండా.. ఆ దేశానికి ఎలాంటి విషయాలు చెప్పకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి సొంత గడ్డపై అడుగుపెట్టారు. అభినందన్ రాకపై శుక్రవారం ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠ రాత్రి 9.30 గంటలకు ముగిసింది.

రోజంతా ఉద్విగ్నతతో ఎదురు చూసిన దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. పాక్‌ చేతిలో బందీగా చిక్కి మాతృదేశానికి తిరిగి వస్తున్న అభినందన్‌కు ఘన స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయం నుంచే జాతీయ పతాకాలు, పూలదండలతో భారీ సంఖ్యలు ప్రజలు పంజాబ్‌లోని వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అని రోజంతా ఆత్రుతతో వేచి చూశారు.

శుక్రవారం పొద్దుపోయినా అభినందన్ రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. చివరికి భారత కాలమానం ప్రకారం రాత్రి 9.10 గంటలకు పాకిస్థాన్‌ సరిహద్దు దళం రేంజర్లు, ఇస్లామాబాద్‌లోని భారత్‌ హైకమిషన్‌కు చెందిన వైమానిక అధికారి తోడురాగా పాక్‌ వైపునుండే వాఘా తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నారు.

ఖాకీ ప్యాంటు, ముదురు రంగు జాకెట్‌తో పౌర దుస్తుల్లో ఇరుదేశాలను వేరు చేస్తున్న గేట్ల వద్దకు గంభీర వదనంతో నడిచి వచ్చారు. ఆయనకు భారత అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దౌత్యపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వైమానిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో తొలుత అమృత్‌సర్‌ విమానాశ్రయానికి, ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.

యుద్ధఖైదీగా పేర్కొన్న పాకిస్థాన్

కాగా, పైలట్‌ యుద్ధ ఖైదీ అని అతన్ని విడుదల చేసిన అనంతరం పాక్‌ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. అయితే, భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు పైలట్‌ను విడుదల చేయాలని పాక్‌ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రంగా పనిచేసింది. భారత్ కూడా బేషరతుగా అభినందన్‌ను విడుదల చేయాల్సిందేనని, ఎలాంటి ఒప్పందాలు ఉండవని తేల్చి చెప్పింది. దీంతో అభినందన్‌ను విడుదల చేయడం తప్ప మరోదారి లేకపోయింది దాయాది దేశానికి.

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను తమకు అప్పగించారని, అతను వెనక్కి రావడం తమకెంతో సంతోషకరమని వైస్‌ చీఫ్‌ ఎయిర్‌మార్షల్‌ ఆర్జీకే కపూర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అతనికి సంపూర్ణ వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్నామని, విమానం నుంచి కిందికి దూకిన క్రమంలో అతని శరీరం ఒత్తిడికి లోనవుతుందని, వైద్య పరీక్షలు తప్పనిసరని అమృత్‌సర్‌ సమీపంలోని అటారి వద్ద మీడియా ఎదుట ఓ ప్రకటన చదివి వినిపించారు.

కాగా, అభినందన్‌‌ను అప్పగించడంలో పాక్ ఆలస్యం చేసింది. మధ్యాహ్నం 3గంటలకే అతన్ని స్వదేశానికి అప్పగించాల్సి ఉండగా రాత్రి 9గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లోని భారత తాత్కాలిక హైకమిషనర్‌ గౌరవ్‌ అహ్లువాలియా ఆ దేశ విదేశాంగ కార్యాలయానికి చేరుకొని పైలట్‌ను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించిన పత్రాల ప్రక్రియను పూర్తిచేశారు. ఈలోగా అభినందన్‌కు సంబంధించిన పాస్‌పోర్టు, వైమానికదళంలో అతను నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన పత్రాలు తీసుకొని వైమానిక దళం కెప్టెన్‌ బిటి క్రైన్‌ లాహోర్‌ పయనమయ్యారు. అక్కడే అభినందన్‌ను పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికారులు భారత అధికారులకు అప్పగించారు.

క్రైన్‌ తోడురాగా వాఘా సరిహద్దులకు పాకిస్థాన్‌ రేంజర్లు ఏర్పాటు చేసిన వాహనంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అదే సమయానికి వైమానికదళం, బీఎస్‌ఎఫ్‌, విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా వాఘా చెక్‌పోస్టుకు చేరుకున్నారు.

ఇమిగ్రేషన్‌కు సంబంధించిన కొన్ని పత్రాలు లేకపోవడంతో భారత అధికారులు మళ్లీ వాటిని తెచ్చి సమర్పించేందుకు కాస్త సమయం పట్టింది. ఇదంతా పూర్తయ్యే సరికి రాత్రి 9 గంటలైంది. ఆ తర్వాత భారత్‌ గడ్డపై అడుగు పెట్టిన అభినందన్‌కు విదేశీ వ్యవహారాల శాఖ, ఐఏఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే అంబులెన్సులో సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది అభినందన్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ఆయనను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వైమానిక దళ అధికారులతో మాట్లాడించారు. అభినందన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలినప్పటికీ కాస్త అలసటతో ఉన్నట్లు కనిపించిందని ఒక పంజాబ్‌ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం 9.30 గంటల తర్వాత మొత్తం పది కార్లతో కూడిన వాహనశ్రేణి ద్వారా అభినందన్‌ వాఘా సరిహద్దు చెక్‌పోస్టు నుంచి బయటకు వచ్చి అమృత్‌సర్‌ విమానాశ్రయానికి పయనమయ్యారు.

ఎంతో ఆనందంగా ఉంది: అభినందన్, తల్లిదండ్రుల భావోద్వేగం

ఆ తర్వాత అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ తోపాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తమ కొడుకును చూసిన ఆనందంలో అభినందన్ తల్లిదండ్రులు భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. తిరిగి స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అభినందన్ తెలిపారు.

చదవండి: సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

- Advertisement -