మిమ్మల్ని దేవుడే కాపాడాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుపై.. సుప్రీం తీవ్ర ఆగ్రహం!

nageswara rao
- Advertisement -

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలంటూ తీవ్రంగా స్పందించింది. ముజఫర్‌పుర్‌ వసతిగృహం అత్యాచారాల కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న అధికారి ఏకే శర్మను తమ అనుమతి లేకుండా సీబీఐ బదిలీ చేయడంపై కన్నెర్రజేసింది.

అంతేగాక, ఆ బదిలీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు తాఖీదు జారీ చేసింది. బదిలీపై వివరణ ఇచ్చేందుకుగాను ఫిబ్రవరి 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ముజఫర్‌పుర్‌ వసతిగృహం కేసు విచారణను బిహార్‌ నుంచి ఢిల్లీలోని సాకేత్‌ జిల్లా కోర్టు సముదాయంలోగల ‘లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో)’ కోర్టుకు బదిలీ చేసింది.

ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శర్మ బదిలీతో సంబంధమున్న అధికారులందరిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

బదిలీలో నాగేశ్వరరావుతోపాటు మరో అధికారి ప్రమేయముందని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ‘ఈ విషయాన్ని మేం చాలా చాలా తీవ్రంగా పరిగణిస్తాం. మా ఆదేశాలతో మీరు ఆడుకున్నారు. ఇక దేవుడే మీకు సహాయం చేయాలి’ అని వ్యాఖ్యానించింది. శర్మ బదిలీ దస్త్రం ముందుకు కదలడంలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరి పేర్లను తమకు తెలియజేయాలని సీబీఐ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లాను ఆదేశించింది.

- Advertisement -