దంతెవాడ: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలోని బచేలిలో గురువారం ఓ బస్సును పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటూ ఓ సీఐఎస్‌ఎఫ్ జవాను మృతి చెందారు. సీఐఎస్ఎఫ్ బలగాలు మార్కెట్లో సరుకులు కొనుక్కుని శిబిరానికి బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతి చెందినవారిలో సీఐఎస్‌ఎఫ్ జవానుతో పాటు బస్సు డ్రైవర్, కండక్టర్, క్లీనర్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత పదిరోజుల్లో దంతెవాడలో మావోయిస్టులు దాడికి పాల్పడడం ఇది రెండోసారి. మొదటగా అక్టోబరు 30న మీడియా వర్గాలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఐదు రోజుల్లో ఎన్నికలు…
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలకు నవంబరు 20న పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్ నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో జరుగుతుంది. తొలి దశ పోలింగ్ సందర్భంగా అక్కడ సీఐఎస్ఎఫ్ యూనిట్‌ను మోహరించారు.
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జగదల్పూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఆ ప్రాంతం.. మావోయిస్టులు బస్సు పేల్చేసిన ప్రాంతానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Visuals from Chhattisgarh: 3 civilians and 1 CISF personnel died in the incident where naxals triggered a blast on a bus near Bacheli in Dantewada. Visuals from the hospital. pic.twitter.com/lRMjW26aSw
— ANI (@ANI) November 8, 2018