టార్గెట్ మోడీ: చంద్రబాబు బెంగళూరు టూర్, ఘన స్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామి, రేపు చెన్నైలో స్టాలిన్‌తో కూడా…

chandrababu devegowda kumaraswamy
- Advertisement -

chandrababu devegowda kumaraswamyబెంగళూరు: బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఆ పనిలో భాగంగా బెంగళూరు వెళ్లారు.  మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు.. ప్రస్తుత కర్ణాటక సీఎం కుమారస్వామిలతో ఇదే విషయమై చర్చించేందుకు బాబు అక్కడి పద్మనాభనగర్‌‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు.

బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి.. పలువురు నేతలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  ఇప్పుడు దక్షిణాది నేతలతోనూ చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన చంద్రబాబు నాయుడికి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి సాదరంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి నేరుగా…

బెంగళూరు విమానాశ్రయం నుంచి చంద్రబాబు నేరుగా దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు.  చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కంభంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండ్రోజుల క్రితం విడుదలైన ఉపఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై చంద్రబాబు.. దేవేగౌడ, కుమారస్వామిలను అభినందించారు. ఈ సందర్భంగా దేవేగౌడకు శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను చంద్రబాబు అందించారు.

chandrababu devegowda kumaraswamy2

కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమి అంశం చర్చకు వచ్చింది. అప్పట్లో చంద్రబాబుకు దేవెగౌడ, కుమారస్వామి మద్దతు పలికారు. ఇప్పుడు ఈ ప్రయత్నాలు చంద్రబాబు ఆధ్వర్యంలో మరింత ఊపందుకోవడంతో.. గురువారం వీరు ముగ్గురూ మరోసారి సమావేశం అయ్యారు.

తాజాగా జరిగిన కర్నాటక ఉప ఎన్నికల్లోనూ జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి తిరుగులేని ఘన విజయం అందుకుని. మోడీకి వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని ప్రకటించింది.  ఈ నేపథ్యంలో దేవెగౌడ, కుమారస్వామిలతో చంద్రబాబు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ బెంగళూరులో చర్చలు ముగిసిన తర్వాత శుక్రవారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కూడా చంద్రబాబు భేటీ అవుతారు.

ఇప్పటికే చంద్రబాబు-స్టాలిన్ ఒకసారి చర్చలు జరిపారు. అప్పట్లో మోడీకి వ్యతిరేకంగా కలిసి ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నారు.

- Advertisement -