జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎస్పీ నేత ఆజంఖాన్‌పై కేసు!

7:18 pm, Mon, 15 April 19
azam-khan-objectionable-comments-on-jaya-prada

లక్నో: సినీనటి, బీజేపీ నేత జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై కేసు నమోదైంది. రాంపూర్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆజంఖాన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే ఆయన మాట మార్చారు. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

అసలు తాను ఆ విమర్శలు చేస్తున్న సమయంలో ఎవరి పేరూ ప్రస్తావించలేదని, తాను జయప్రదను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని రుజువు చేస్తే.. ఎన్నికల్లో పోటీ నుంచి కూడా తప్పుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు.

అంతేకాదు, తాను తొమ్మిదిసార్లు రాంపూర్‌ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, మంత్రిగా కూడా పనిచేశానని, ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో తెలియని పరిస్థితిలో తాను లేనంటూ ఆజంఖాన్ వ్యాఖ్యానించారు.

అసలు ఆజంఖాన్ ఏమన్నారంటే…

‘‘నేను ఓ వ్యక్తిని రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె పదేళ్లపాటు మీ ప్రతినిధిగా రాంపూర్ రక్తం తాగింది.. అయితే ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది కానీ నాకు మాత్రం ఆమె ఖాకీ అండర్ వేర్ ధరిస్తుందని 17 రోజుల్లోనే తెలిసింది..’’అని ఆజంఖాన్‌ వ్యాఖ్యానించారు.

 అయితే ఆయన జయప్రదను ఉద్దేశించే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే, అదే రాంపూర్ స్థానం నుంచి జయప్రద గతంలో సమాజ్‌వాదీ పార్టీ తరుపున రెండుసార్లు గెలిచారు.

ఆ తరువాత జయప్రద గురించి అసభ్యకరమైన ఫొటోలు ప్రచారంలోకి రావడం, ఆమెపై యాసిడ్ దాడి యత్నం జరగడంతో.. ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా గత నెలలో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రాంపూర్ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు.

ఆజంఖాన్ వ్యాఖ్యలపై నేతలు ఫైర్…

జయప్రదను ఉద్దేశించి ఎస్పీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీ(యూ) నేతలు తీవ్రంగా స్పందించారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను వారు ఖండించడమేకాక.. వెంటనే జయప్రదకు అతడు క్షమాపణలు చెప్పాలని కూడా జేడీ(యూ) నేత పవన్ వర్మ డిమాండ్ చేశారు.

మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని, నోటీసులు కూడా పంపింది. అంతేకాదు, ఈ ఎన్నికల్లో ఆజంఖాన్ పోటీ చేయకుండా ఈసీ అతడిపై నిషేధం విధించాలంటూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి చంద్ర మోహన్ విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యల ద్వారా అతడు రాజకీయాలను దిగజార్చారంటూ దుయ్యబట్టారు. తన అసభ్యకర వ్యాఖ్యలతో మహిళలను కించపరచడమేకాక, వారి మనోభావాలను ఆజంఖాన్ దెబ్బతీశారని అన్నారు. ఇది సోషలిస్టు పార్టీగా చెప్పుకునే ఎస్పీ, ఆజంఖాన్‌ల అసలు స్వరూపమంటూ చంద్రమోహన్ మండిపడ్డారు.