ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా? బీరు సీసాల్లో తేళ్లు ! చూసుకోలేదో ఇక అంతే!

6:41 pm, Mon, 15 April 19
beerbottle

పరకాల : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలలో మద్యం ప్రియుడికి షాకిచ్చే అంశం ఎదురైంది. అసలే ఎండాకాలం, ఆపై ఆదివారం కావడంతో కాసింత చల్లబడుదామనుకున్నాడు ఓ యువకుడు. ఆర్టీసీ డిపో సమీపంలోని ఓ వైన్స్ షాపులో లైట్ బీరు తీసుకున్నాడు. కూల్ గా ఉండటంతో సీసాలోని సరుకు లాగించేశాడు. చివరగా బీరు అయిపోయేసరికి అడుగున తేలు కనిపించడంతో షాక్ కు గురయ్యాడు.

సీసాలోని బీరును మూడొంతులకు పైగా తాగడంతో సదరు యువకుడికి భయం పట్టుకుంది. సీసా అడుగుభాగంలో తేలు కనిపించడంతో ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందేమోనని కంగారు పడ్డాడు. అయితే ఆ సీసా ముదురు రంగులో ఉండటంతో మొదట్లో గుర్తించలేదనేది అతడి వాదన.

అదే క్రమంలో విషయం కాస్తా వైన్స్ షాపు నిర్వాహకులకు తెలిపాడు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటున్నాడు యువకుడు. దాన్నేమైనా మేము తయారుచేశామా.. కంపెనీ వచ్చినదానికి తామేమీ చేస్తామంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారట. దాంతో సదరు యువకుడు పరకాల ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారట.

సాధారణంగా ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు డిమాండ్ సప్లై సూత్రాన్ని తలదన్నుతాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ఆయా కంపెనీలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొడక్షన్ స్పీడప్ లో భాగంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. గతంలో కూడా బీరు సీసాల్లో చెత్త చెదారం వచ్చిన సందర్భాలున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం కొనుగోలుదారులే.

బీరు సీసాలో తేలు ఘటన కొత్తేమీ కాదు. ప్యాక్డ్ బాటిల్స్ లో ఇలాంటి తతంగాలు ఇదివరకు ఎన్నో వెలుగుచూశాయి. వ్యాపారాలు చేసుకోవడం వారి పని, జాగ్రత్తగా ఉండటం పని. మనం కొనే బాటిల్స్ ఏవైనా.. ఒకసారి ఆ దుకాణాల దగ్గరే చెక్ చేసుకోవడం బెటర్ కదా.