
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 29 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపారు.
రెండు నెలల క్రితం ఢిల్లీ మెట్రోల్లోనూ, ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 29 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.
‘‘రక్షా బంధన్ శుభ సందర్భంగా నా అక్కచెల్లెళ్లకు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నా. అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లోనూ, క్లస్టర్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీని ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ప్రకటనపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో రాజధానిలోని మెట్రోల్లోనూ, బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు లభించింది. కేజ్రీవాల్ ఇప్పటికే రాజధానిలో పలు సంచలన పథకాలు అమలు చేస్తున్నారు.








