‘కరోనా’ అప్‌డేట్: దేశంలో ఒక్కరోజే 95 వేల పాజిటివ్ కేసులు, 75 వేలు దాటిన మృతుల సంఖ్య

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టకపోగా మరింత పెరుగుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 

గడిచిన 24 గంటల్లో ఏకంగా 95 వేల కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం కరోనా వచ్చిన దగ్గర్నించి ఇదే మొదటిసారి.

మరోవైపు దేశంలో కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రోజూ 1100లకు పైగా మరణాలు సంభవిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1172 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 75,062కు చేరుకుంది. 

ఇలా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడానికి కారణం కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ సంఖ్యలో నిర్వహిస్తుండడమేనని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. 

దేశంలో రోజూ భారీ సంఖ్యలో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిన్న ఒక్కరోజే 11.29 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. 

అయితే కోవిడ్ మృతుల్లో దాదాపు 70 శాతం మందికి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉందని పేర్కొంది. 

- Advertisement -