హైదరాబాద్: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మనసు-మమత, మౌనరాగం తదితర సీరియళ్లలో నటించిన శ్రావణి హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్‌లో నివాసం ఉంటోంది.
మంగళవారం రాత్రి తన నివాసంలోనే ఆమె ఉరి వేసుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
శ్రావణి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గతంలో ఆమెకు టిక్‌టాక్ ద్వారా దేవరాజు రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు.
ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే ఆ తరువాత దేవరాజు రెడ్డి నిజస్వరూపం తెలిసి శ్రావణి అతడ్ని దూరంగా పెట్టింది.
దీంతో అతడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో వ్యక్తిగతంగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానంటూ బెదిరించాడు.
రూ.లక్ష ఇస్తే తనతో దిగిన ఫొటోలను డిలీట్ చేస్తానని దేవరాజు రెడ్డి ఒప్పుకోవడంతో శ్రావణి విడతల వారీగా గూగుల్ పే ద్వారా అతడికి డబ్బు పంపింది.
డబ్బు తీసుకున్న తరువాత అతడు ఫొటోలు డిలీట్ చేయకుండా ఇంకా వేధిస్తుండడంతో జూన్ 22న శ్రావణి ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లభించకపోవడం, దేవరాజు రెడ్డి వేధింపులు ఆగకపోవడంతో చివరికి శ్రావణి బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ మేరకు కేసు నమోదు కేసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.