నిజ జీవితంలోనూ నాకు వస్త్రాపహరణం జరిగింది: ‘టీవీ ద్రౌపది’ రూపా గంగూలీ

mahabharat-draupadi-roopa-ganguly-recalls-how-she-was-lynched-in-2016-in-front-of-police
- Advertisement -

రూపా గంగూలీ పేరు గుర్తుందిగా! మీరే కాదు, ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే మహాభారత్ టీవీ సీరియల్‌లో ద్రౌపది పాత్రకు ప్రాణం పోసిందావిడ. వినోద ప్రధాన టీవీ చానళ్లు పెద్దగా లేని ఆ రోజుల్లో దూరదర్శన్‌లో రామాయణ్, ఆ తరువాత మహాభారత్ సీరియల్స్ ప్రసారమై ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేశాయి మరి!

భారత టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహాభారత్ సీరియల్ ఎప్పటికీ అగ్రస్థానంలోనే ఉంటుంది. ఇటీవల కరోనా లాక్‌డౌన్ సందర్భంగా రీ టెలికాస్ట్ చేసినా కూడా ఈ సీరియల్ రేటింగ్స్ అదిరిపోయాయంటే.. అదంతా కథ, నటీనటుల నటనా చాతుర్యం, ఆ సీరియల్ దర్శకుడి సృజనాత్మకతే. 

ఇక అసలు విషయానికొస్తే.. మహాభారత్ టీవీ సీరియల్‌లో ద్రౌపది పాత్రలో బెంగాలీ నటి రూపా గంగూలీ జీవించేసిందనే చెప్పొచ్చు. ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టంలో ఆమె ముఖంలో నిస్సహాయతను అద్భుతంగా పలికించింది.

అయితే, మహాభారత్ టీవీ సీరియల్‌లో మాత్రమే కాదు, తనకు నిజజీవితంలోనూ వస్త్రాపహరణం తరహా ఘటన ఎదురైందని రూపా గంగూలీ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం రూపా గంగూలీ బీజేపీలో ఉన్నారు. ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా. అయితే, తాను రాజకీయాల్లో ప్రవేశించిన సమయంలో 2016లో తనపై జరిగిన అమానుష దాడి ఘటనను ఇటీవల ఆమె గుర్తు చేస్తున్నారు.

కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ వద్ద తనపై ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, తనను నేలకేసి కొట్టి.. ఒంటిపై ఉన్న చీర కూడా లాగేశారంటూ నాటి చేదు సంఘటన గురించి వివరించారు.

తన తలను కారుకేసి కొట్టారని, దాంతో ఓ కన్ను పోయినంత పనైందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తాను  ఆ గాయాలతో అలాగే కారు డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు.

ఆ సమయంలో తనకు కళ్లు సరిగా కనిపించపోవడంతో తన కార్లో ఉన్న మహిళా కార్యకర్తలు సూచనలు ఇస్తుంటే కారు నడిపానని, నాటి దాడి ఫలితంగా ఇప్పటికీ తనకు ఓ కన్ను సరిగా కనిపించదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తరువాత తన శరీరానికి తగిలిన గాయాలు తగ్గిపోయినానా, ఆనాటి దాడి ఘటన మాత్రం తన హృదయంలో అలాగే నిలిచిపోయిందని రూపా గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -