
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఔరాయియా జాతీయ రహదారిపై ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో 24 మంది వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 30 మంది క్షతగాత్రులయ్యారు. వలస కూలీలు తమ స్వగ్రామం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రి, సైఫాయి పీజీఐ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి…
మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన కూలీలు త్వరితగతిన కోలుకోవాలంటూ మోడీ ట్వీట్ చేశారు.
उत्तर प्रदेश के औरैया में सड़क दुर्घटना बेहद ही दुखद है। सरकार राहत कार्य में तत्परता से जुटी है। इस हादसे में मारे गए लोगों के परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) May 16, 2020
మరోవైపు అధికారులు ప్రమాదం చోటుచేసుకోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉన్న చోట పని లేకపోవడంతో వలసకూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారిని సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు రైల్వేశాఖ కూడా శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. అయితే రైళ్లలో ప్రయాణం అంత సులభమేమీ కాదు, దీనికో ఆప్లికేషన్ ప్రాసెస్ ఉంది.
అయితే అప్లికేషన్ పెట్టుకున్నా.. తమ నంబర్ ఎప్పటికి వస్తుందో.. ఇంకా అన్ని రోజులు వేచి చూడలేక వలసకూలీలు ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు దొరకబుచ్చుకుంటున్నారు.
కొందరు రోడ్డు వెంట కిలోమీటర్ల దూరం కాలినడకన వెళుతుంటే.. మరికొందరేమో ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ప్రయాణిస్తూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.








