సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. రియా చక్రవర్తి అరెస్ట్!

Rhea Chakraborty Arrested by NCB
- Advertisement -

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారిస్తోన్న నటి రియా చక్రవర్తి(28)ని మంగళవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్న ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మెరిండాలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

వీరంతా నిషేధిత మాదక ద్రవ్యాలను పొందినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు దర్యాప్తును తొలుత సీబీఐ చేపట్టింది. 

సుశాంత్ సన్నిహితురాలైన రియా చక్రవర్తిని విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్ చాట్‌ను సీబీఐ అధికారులు పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండడంతో ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటికొచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

ఇక నటి రియా చక్రవర్తిని కూడా ఎన్సీబీ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఆదివారం 6 గంటలపాటు, సోమవారం 8 గంటలపాటు రియాను విచారించారు.

మంగళవారం కూడా సుదీర్ఘంగా విచారించిన అధికారులు చివరికి ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఏడున్నర గంటల ప్రాంతంలో కోర్టు ఎదుట హాజరుపరిచారు. 

ఈ కేసులో ఇప్పటికే రియాతోపాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి తాగేవాడని రియా ఎన్‌సీబీ అధికారులకు తెలిపింది. 

తాను డ్రగ్స్ తీసుకొచ్చానే తప్ప.. వాడలేదని ఆమె ఇప్పటికే పలు వార్తా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొంది. ఎన్‌సీబీ అధికారుల విచారణలోనూ రియా ఇదే చెప్పినట్లు తెలుస్తోంది. 

తాను ఏం చేసినా సుశాంత్ కోసమే చేశానని సోమవారం నాటి అధికారుల విచారణలో ఆమె చెప్పినట్లు సమాచారం. ఆమెను నిన్ననే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా అధికారులు అలాంటిదేమీ చేయలేదు. 

రియా తమ విచారణకు సహకరిస్తున్నారనే పేర్కొన్నారు. మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు. 

ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాటి విచారణలో డ్రగ్స్‌ స్మగ్లర్ బాసిత్‌ను ఐదుసార్లు కలిసినట్టు రియా ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. 

విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు సాయంత్రం రియా చక్రవర్తిని వైద్య పరీక్షల నిమిత్తం ముంబైలోని సియాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ ఆమెకు వైద్య పరీక్షలతోపాటు కోవిడ్‌కు సంబంధించిన ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచగా, జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండు విధించారు. 

 

- Advertisement -