మీకొచ్చిన లాభమేంటి?: వైరల్ అవుతున్న మలైకా కొవిడ్ రిపోర్టుపై అమృతా అరోరా ఆగ్రహం…

- Advertisement -

ముంబై: తాను కరోనా బారినపడ్డానని, వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా స్వయంగా పేర్కొంది.

ప్రియుడు అర్జున్ కపూర్‌ కరోనా బారిన పడినట్టు వెల్లడించిన తర్వాతి రోజే మలైకా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

మలైకాకు కరోనా వచ్చిన విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడంపై ఆమె సోదరి అమృత అరోరా తీవ్రస్థాయిలో మండిపడింది.

మలైకా కరోనా రిపోర్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నా సోదరి కరోనా రిపోర్టు వివిధ వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇతర మాధ్యమాల్లో షేర్ అవుతోంది.

ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆమె ప్రార్థిస్తోంది. తొందరగా కోలుకునేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటోంది.

ఇలాంటి సమయంలో ఏంటిది? ఇలా చేయడం సబబేనా? ఈ మనుషులకేమైంది?’’ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మలైకాకు అది రావడం సబబేనని కొందరు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రిపోర్టును షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని ప్రశ్నించింది. ఆమె చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని పేర్కొంది. ఆమె గురించి చర్చించుకోవడం వల్ల వారికొచ్చే లాభమేంటని మండిపడింది.

‘‘మలైకాకు కరోనా రావడం సబబేనంటూ లాఫింగ్ ఎమోజీలు పెడుతున్నారు. ఎందుకిలా?’’ అని అమృత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రశ్నించింది.

- Advertisement -