రామనగరం: కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నిలలో బీజేపీపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటుతోంది. రెండు శాసనసభ స్థానాలను ఈ కూటమి తన సొంతం చేసుకుంది.
ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి రామనగరం నియోకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఆమె ఏకంగా 1,09,137 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధి చంద్రశేఖర్‌పై గెలుపొందారు. జామ్ ఖండీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి న్యామగౌడ 39,480 ఓట్ల మెజార్టీతో కులకర్ణి శ్రీకాంత్ సబ్రావ్‌పై జయకేతనం ఎగురవేశారు.
లోక్‌సభ స్థానాలు.. మూడు పార్టీలు తలొక్కటి…
బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప, మాండ్యలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడలు విజయం సాధించగా… శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర స్వల్ప మెజార్టీతో విజయన్ని అందుకున్నారు.
బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పాగా…
కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంచుకోట, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యమైన బళ్లారిలో ఆ పార్టీకి దిమ్మతిరిగే ఫలితం ఎదురైంది. బళ్లారి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప ఏకంగా 2,43,161 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని మట్టికరిపించారు.
మొత్తం 5 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో… కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నాలుగు స్థానాల్లో విజయదుందుభి మోగించగా… బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది.