చెన్నై: శక్తిమంతురాలైన మంత్రగత్తెను కావాలన్నఆమె స్వార్థానికి నాలుగేళ్ల చిన్నారి నిండు జీవితం బలైపోయింది. సోమవారం నిందితురాలి అరెస్ట్‌తో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పుదుకోట్టై జిల్లా కరుంపట్టికి చెందిన వెలైసామి (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతడి కుమార్తె షాలిని (4) అక్టోబర్ 25వ తేదిన తన ఇంటికి సమీపంలో ఆటలాడుకుంటూ కనిపించకుండా పోయింది. చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు వెతకగా.. ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో.. బ్లేడుతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురై పడిఉన్న షాలిని కనిపించింది గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
షాలిని మృతదేహం దొరికిన ప్రదేశంలో సెమ్ముని ఆలయం ఉండడంతో.. బహుశా బాలికను బలి ఇచ్చి ఉండొచ్చనే కోణంలో ఇలుప్పూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే ప్రాంతానికి చెందిన సోది చెప్పే శింగారం భార్య చిన్నపిల్లై (47) అనే మహిళ చేతిలో బ్లేడుతో కోసుకున్నట్లుగా గాయం ఉండడంతో.. ఆమెను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు.
చివరికి తానే ఆ చిన్నారిని బలి ఇచ్చానంటూ చిన్నపిల్లై నేరాన్ని అంగీకరించడంతో ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం వింటే ఒళ్లు జలదరించకమానదు. దీంతో పోలీసులు మంత్రగత్తె చిన్నపిల్లైౖని తిరుమయం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తిరుచ్చిరాపల్లి జైలుకు పంపించారు.
ఒళ్ళు గగుర్పొడిచే వాంగ్మూలం..
‘‘షాలిని ఇంటికి సమీపంలోనే గత కొన్నేళ్లుగా నేను జీవిస్తున్నాను. సోది చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అప్పుడప్పుడు నాపై దేవుడు పూనినట్లుగా ఆడుతుంటాను, ఊరికి సమీపంలోని అడవిలో ఉన్న సెమ్ముని ఆలయంలో పొట్టేలు, గొర్రె, కోడిలను బలి ఇచ్చి సోది చెబుతుంటాను. ఎవరినైనా నరబలి ఇచ్చి నా మంత్రశక్తి పెంచుకోవాలనుకున్నాను.. ఇందుకు షాలినిని ఎంచుకున్నాను..’’ అంటూ నిందితురాలు చిన్నపిల్లై వివరించింది.
‘‘షాలినిని ఎత్తుకెళ్లేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా గత అక్టోబర్ 25న ఒంటరిగా ఆడుకుంటు కనిపించింది, అ చూట్టూ పక్కల జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో ఆ పిల్లను ఎత్తుకుపోయాను. తనకి నేను బాగా పరిచయం ఉండడంతో మారాం చేయకుండా నాతో వచ్చేసింది. నేరుగా సెమ్ముని ఆలయానికి వెళ్లి పూజలు చేసి నా వద్దనున్న బ్లేడుతో షాలిని గొంతుకోసి బలిచ్చాను. ఆ తరువాత షాలిని మృతదేహాన్ని ఆలయానికి దూరంగా పడేసి ఇంటికి వెళ్లిపోయాను..’’ అంటూ తాను చేసిన దారుణాన్ని వివరించిందామె.