- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిదశలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాలోని మొత్తం 18 నియోజకవర్గాలకు తొలి విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
లక్ష మందితో భద్రతా ఏర్పాట్లు…
పోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ప్రభుత్వం లక్ష మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. 700 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించింది. ప్రతి 32 మంది ఓటర్లుకు ఓ పోలీసును వినియోగించారు. ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం అక్కడక్కడా డ్రోన్లను ఉపయోగిస్తోంది. 50 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 1500 శాటిలైట్ ట్రాకర్స్ సాయంతో పహారా కాస్తున్నారు.
మొత్తం 18 నియోజకవర్గాల్లోని 32 లక్షల ఓటర్ల కోసం 4,336 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:30 సమయానికి 12.3 శాతం పోలింగ్ మాత్రమే జరగ్గా, సాయంత్రం 4:30 కల్లా ఇది 56 శాతానికి చేరుకుంది. అత్యధికంగా రాజనందర్ గావ్‌లో 39 శాతం పోలింగ్ నమోదవ్వగా… సుకుమాలో 19 శాతం, జగదల్‌పూర్‌లో 17 శాతం, బస్తర్‌లో 18 శాతం మంది పౌరులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు…
273 సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 53 కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటర్లు సైతం ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు. సుక్మా జిల్లాలోని దోర్నపల్ పోలింగ్ స్టేషన్‌లో 100 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె పోలింగ్ స్టేషన్‌కు రావడంలో భద్రతా సిబ్బంది కూడా సహకరించారు.
ఎన్నికల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో…
అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు… పలుచోట్ల హింసాత్మక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. సుకుమాలోని కొంటబండ పోలింగ్ కేంద్రంలో ఐఈడీ బాంబు పెట్టడంతో కలకలం రేగింది. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే బాంబును నిర్వీర్యం చేసిన భద్రతా సిబ్బంది… పక్కనే ఉన్న ఓ చెట్టుకింద పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు దంతేవాడలో పోలింగ్‌ను అడ్డుకునేందుకు మావోస్టులు ఓ ల్యాండ్‌మైన్ పేల్చారు. అయితే, దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో ఆరు చోట్ల మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ…
రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు పోలింగ్‌కు ముందు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనారాం సాహూ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు రోజుల కిందట కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, గిరిజన నేత రామ్‌దయాళ్ ఉయికే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
- Advertisement -