
అమరావతి: కర్నూలులో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కష్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసు ఎందుకని ప్రధానిని చంద్రబాబు ప్రశ్నించారు.
శనివారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు సభలో రాష్ట్రంపై మోడీకి ఉన్న ద్వేషం మరోసారి బయటపడిందని చంద్రబాబు ఆరోపించారు. ధైర్యముంటే చెప్పినదానికి, చేసిన దానికి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోడీ సభకు వైసీపీ కార్యకర్తలా?
మోడీ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తరలించారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా, నిందలు మోపుదామనుకుంటే సహించొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేగాక, ప్రజలు టీడీపీకి సానుకూలంగా ఉన్నారన్న అతి విశ్వాసం నాయకులకు తగదని హితవు పలికారు.
చివరి వరకూ అందరూ కష్టపడాల్సిందేనని, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అంతేగాక, ఈసారి ఇంఛార్జీల వ్యవస్థ ఉండబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో పార్టీ గెలుపు ఏకపక్షంగా ఉందని, దీన్ని అదనుగా చూసుకుని ఎవరైనా కష్టపడకుండా ఉంటే ఉపేక్షించబోనని చంద్రబాబు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని అన్నారు.
రాజమండ్రిలో ప్రచారం చేసిన సందర్భంలో కూడా చంద్రబాబు మోడీపై విరుచుకుపడ్డారు. మోడీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. ఏపీ అభివృద్ధిపై గుజరాత్ లోనైనా చర్యకు సిద్ధమేనని అన్నారు. ఒక్క హైదరాబాద్ పోతే ఇరవై హైదరాబాద్‌లు తయారుచేస్తానని అన్నారు. రిజర్వేషన్లు అడిగితే కాపులను దిక్కున్న చోట చెప్పుకోమని జగన్ అన్నారని చంద్రబాబు చెప్పారు.








