
బెంగుళూరు: కన్నడ చిత్రపరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా గుర్తింపు పొందిన చిత్రం ‘కేజీఎఫ్’ . డిసెంబరు 21,2018వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లను రాబట్టింది. కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేశారు.
విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల మేరకు వసూలు సాధించింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటుడు యష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. నేటితో ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుందని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఓ కన్నడ చిత్రానికి అంతటా ఇంత ఆదరణ లభించడంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల కేజీఎఫ్ చిత్ర సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో పాటు చిత్రీకరణ జరుపుకుంటుంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరించి 2020లో మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నాడట. ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్‌ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. బాలీవుడ్ నటి రవీనా టాండన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.








