పుణే : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చాలని మావోయిస్టులు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. ప్రధాని మోడీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారనే విషయాన్ని పూణే పోలీసులు బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి మావోయిస్టులు గత ఏడాది ఏప్రిల్‌లో రాసిన ఓ లేఖను కూడా శుక్రవారం విడుదల చేశారు. మావోయిస్టులు ఏకంగా ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జాకబ్ విల్సన్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతడి ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ లేఖ తాజాగా కలకలం రేపుతోంది. ప్రధాని మోడీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకున్నారనే విషయం ఆ లేఖలో స్పష్టంగా ఉంది.
మోడీ హత్యకు కారణాలేమిటి?
దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ హవా కొనసాగడాన్ని మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు. మోడీ హవా కారణంగా తమ మనుగడ కష్టమవుతుందని భావించి ఆయన్ని అంతమొందించాలని వారు కుట్ర పన్నారు. తమకు ప్రధాని కొరకరాని కొయ్యగా మారారనేది మావోయిస్టుల భావన. దీనికితోడు పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రధాని హత్య కుట్రకు ఇవే కారణాలని పోలీసులు పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే మోడీని కూడా అంతమొందించాలని, ఇందుకు ఆయన రోడ్ షోలనే లక్ష్యంగా చేసుకోవాలని, దీనికి అనుగుణంగా తమ చర్యలు ఉండాలని హై కమాండ్‌కు మావోయిస్టులు రాసిన లేఖలో పేర్కొన్నారు. నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేయాలని, దీనికోసం రూ.8 కోట్లు కావాలంటూ మావోయిస్టు కేంద్ర కమిటీకి తెలిపారు.
మరోవైపు ఐసిస్ ఉగ్రసంస్థ కూడా గత నెలలో ప్రధాని మోడీని హతమార్చే కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే వీరి కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. స్నిప్పర్ రైఫిల్‌తో మోడీని కాల్చి హత్యచేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్ బృందం ఇటీవల వెల్లడించింది.