ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరుడు, జమాత్-ఉద్-దవా(జేయూడీ) నేత మౌలానా బషీర్ భారత్, ప్రధాని మోడీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు గురవుతాడని, ఆ వెంటనే భారత దేశం ముక్కలు అవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రంజాన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) పరిధిలోని రావాలాకోట్ నగరంలోని ఓ కార్యక్రమం బషీర్ మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: రాజీవ్ తరహాలో మోడీ హత్య! భారీ కుట్రకు మావోయిస్టుల ప్లాన్!?
‘‘త్వరలో ఇస్లాం జెండా.. అమెరికా, ఇండియాల్లో ఎగురుతుంది. భారత ప్రధాని మోడీ హత్యకు గురవుతాడు. భారత్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎంతో మంది అమరులవుతారు. ఆయా దేశాలు ముక్కలు కావటం ఖాయం..’ అని జేయూడీ నేత మౌలానా బషీర్ వ్యాఖ్యానించాడు. జిహాద్(పవిత్ర యుద్ధం) రంజాన్ పవిత్ర నెలలోనే జరగాలని, అలాంటప్పుడే అసువులు బాసిన యుద్ధ వీరులు స్వర్గానికి వెళ్తారని బషీర్ ఆవేశపూరితంగా మాట్లాడాడు.
జిహాద్‌కు సిద్ధం చేయండి…
జేయూడీ వర్గాలు భారత్ నాశనాన్ని, కశ్మీర్ స్వతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయని, పీఓకేలో ఉన్న ప్రజలంతా తమ ఇంట్లోని పిల్లలను జిహాద్‌కు సిద్ధం చెయ్యాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు. అవసరమైతే ఆర్థిక సాయం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. మౌలానా బషీర్ ప్రసంగం తాలూకు వీడియోలు కశ్మీర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.