
న్యూఢిల్లీ: రేపటి నుంచి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాయి. రెండో తేదీ ఆదివారం సెలవు. అంటే.. రేపటి నుంచి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులు మూతన్నట్టే.
బ్యాంక్ యూనియన్లు 20 శాతం పెంపుతో వేతన సవరణ కోరుతున్నాయి. 2017 నవంబరు నుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉంది. తమ డిమాండ్లపై సానుకూల ప్రకటన రాకుంటే సమ్మెకే వెళ్లాలని యూనియన్లు నిర్ణయించాయి.
చదవండి: ‘పీకే’కు షాక్! బహిష్కరణ వేటు వేసిన జేడీయూ అధిష్ఠానం, ఎందుకంటే…
వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండుతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగ బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులకు సమ్మె గురించి సమాచారం అందించాయి.
తక్షణ వేతన సవరణను డిమాండ్ చేస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపు నిచ్చింది. ఈ సమ్మెలో వివిధ యూనియన్లు పాల్గొంటున్నాయి.
చదవండి: కరోనా వైరస్: గడగడలాడుతోన్న ప్రపంచం.. ఒక్క చైనాలోనే 170 మంది మృతి
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ (ఎన్‌వోబీడబ్ల్యూ) వంటి యూనియన్లు ఉన్నాయి.
సమస్య పరిష్కార కోసం చీఫ్ లేబర్ కమిషనర్ ఎదుట జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేదని తెలుస్తోంది. తమ డిమాండ్ల నుంచి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి కూడా ఎలాంటి హామీ రాలేదని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు.
వేతన సవరణపై ఐబీఏ స్పందించడం లేదని, దీంతో తమకు సమ్మె మినహా మరో అవకాశం లేకుండా పోయిందని, సమ్మె కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని, తమతో సహకరించాలని కస్టమర్లకు యూనియన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.








