

న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనాతో పాటు రూ.90 కోట్ల నిధులను మళ్లించిన కేసులో నిందితుడు, లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను దుబాయ్ అధికారులు భారత్‌కు అప్పగించారు.
ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు చేరుకున్న వీరిని ఈడీ అధికారులు వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం సక్సేనాను అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టగా నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
అదేవిధంగా, ఓ విదేశీ క్షిపణి తయారీ కంపెనీ నుంచి తన ఎన్జీవోకు వచ్చిన రూ.90.72 కోట్ల ను దారి మళ్లించిన కేసులో దీపక్ తల్వార్‌ను పటియాలా కోర్టు ఏడురోజుల కస్టడీకీ అనుమతించింది. కాగా, రాజీవ్ సక్సేనా సుమారు 45మిలియన్ డాలర్లను స్విస్ బ్యాంకులో దాచి పెట్టినట్లు ఈడీ పేర్కొంది.








