బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే తన రాజకీయ అరంగేట్రం గురించి అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. అయితే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నదీ త్వరలోనే ప్రకటించనున్నట్టు వివరించారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
మోడీ ప్రభుత్వంపై విమర్శల జడివాన…
కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపిస్తోన్న ప్రకాశ్ రాజ్ ఇటీవల తరచూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన తాజా ప్రకటనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగంలో రాణించినట్టుగానే రాజకీయాల్లోనూ రాణించాలని కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న చర్చ అప్పుడే మొదలైంది.