హైదరాబాద్: అతి చిన్న వయసులోనే ఓ బాలుడు గొప్ప విజయం సాధించాడు. దీనిని వార్తాపత్రికలో చదివిన భారత ప్రథమ పౌరుడు ఆ బాలుడ్ని తన వద్దకు పిలిపించుకుని అభినందించారు. అవును.. సికింద్రాబాద్‌లోని బోల్టన్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సమన్యు పోతరాజు(8) అతి చిన్న వయసులో పర్వతారోహణలో గొప్ప విజయం సాధించాడు.
డిసెంబర్ 12, 2018న తన సోదరి హసిత, తల్లి లావణ్యతోపాటు మరో ఇద్దరితో కలిసి ఆస్ట్రేలియాలోని 2228 అడుగుల ఎత్తైన మౌంట్ కొసియుస్కోను అధిరోహించాడు. అంతకుముందు ఇదే ఏడాదిలో సమన్యు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వతమైన టాంజానియాలోని కిలిమంజారోను కూడా అధిరోహించాడు.
రాష్ట్రపతి స్వయంగా ఆహ్వానించి…
తన శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ ఏడాది కూడా విడిది చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వార్తాపత్రికలో ఈ విషయాన్ని చూశారు. దీంతో వెంటనే సమన్యును తన వద్దకు తీసుకురావలసిందిగా అతడు చదువుతున్న బోల్టన్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత చెన్నాప్రగడకు వర్తమానం పంపించారు.
దీంతో క్రిస్మస్ రోజున సమన్యు తన తల్లిదండ్రులు, సోదరి హసిత, కోచ్ రాజి తమ్మినేని, మడుగుల లావణ్యలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాడు.
అతిచిన్న వయసులోనే పర్వతారోహణలో గొప్ప విజయం సాధించిన సమన్యును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. ఆయనతోపాటు హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రశంసలు కూడా అందుకున్నాడు సమన్యు. ఇప్పటి వరకు తాను నాలుగు పర్వతాలను అధిరోహించానని, త్వరలో జపాన్‌లోని ఫ్యూజీ పర్వతాన్ని అధిరోహించేందుకు తగిన శిక్షణ తీసుకుంటున్నానని సమన్యు వెల్లడించాడు.
పెద్దయ్యాక ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక అని తెలిపిన సమన్యు.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం!