26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సర్వే: ఎన్డీఏ మళ్లీ రావాలని 60 శాతం, టీఆర్ఎస్, వైసీపీ జోరు, భారీగా పుంజుకున్న యూపీఏ,...

సర్వే: ఎన్డీఏ మళ్లీ రావాలని 60 శాతం, టీఆర్ఎస్, వైసీపీ జోరు, భారీగా పుంజుకున్న యూపీఏ, హంగేనా?

modi-rahul
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఇండియా టుడే – కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌(ఎంవోటీఎన్‌) పేరుతో నిర్వహించిన సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయనీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ కూటమి 99 సీట్లు కోల్పోనుందని తేలింది.

సర్వేలన్నీ హంగ్ వైపే..

అటు యూపీఏ కూటమి కూడా ఎన్డీయే కన్నా తక్కువ సీట్లే గెలుస్తుందనీ, అయితే గతంతో పోలిస్తే ఈ కూటమికి 106 సీట్లు అధికంగా, 166 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. రెండు కూటముల్లో దేనికీ సాధారణ ఆధిక్యం (272 సీట్లు) రాదు కాబట్టి పార్లమెంటులో హంగ్‌ తప్పదని ఎంవోటీఎన్‌ సర్వే జోస్యం చెబుతోంది.

‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో భాగంగా ఏపీ, తెలంగాణ, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, యూపీ సహా 19 రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 97 లోక్‌సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఈ సర్వేను 2018, డిసెంబర్‌ 28 నుంచి 2019, జనవరి 8 మధ్యకాలంలో నిర్వహించారు. ఈ సర్వేలో 19 రాష్ట్రాలకు చెందిన 13,179 మంది పాల్గొన్నారు.

పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 202 స్థానాలు, కాంగ్రెస్‌కు 96 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్డీయే, యూపీఏల్లో ఏ కూటమిలోనూ లేని ఇతర పార్టీలకు మాత్రం దాదాపు గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లే ఇప్పుడూ వచ్చే అవకాశముందంది. ఆ పార్టీలన్నీ కలిపి 140 సీట్ల వరకు గెలుస్తాయనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీటి మద్దతు తప్పనిసరని సర్వే పేర్కొంది.

అంటే దాదాపు 100 సీట్లు ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి చేజారి యూపీఏ ఖాతాలో చేరనున్నాయి. ప్రస్తుతం ఇరు కూటముల్లోనూ లేని ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి, తృణమూల్, పీడీపీలు యూపీఏలో చేరితే ఆ కూటమికి అధికారం వస్తుందని తెలిపింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలవగా, ఎన్డీయే కూటమికి కలిపి 336 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

ఎన్డీయే 2014 కన్నా 99 సీట్లు కోల్పోయి 237 స్థానాలు గెలుచుకుంటుందని ఇండియాటుడే.. 103 స్థానాలు కోల్పోయి 233 సీట్లను గెలుచుకుంటుందని రిపబ్లిక్‌ టీవీ తేల్చాయి. మరోవైపు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ గతం కన్నా 106 సీట్లు పెంచుకుని 166 వద్ద నిలుస్తుందని ఇండియాటుడే.. 60 నుంచి 167 స్థానాలకు దూసుకుపోతుందని రిపబ్లిక్‌ టీవీ అంచనా వేశాయి. రెండు సంస్థలు కూడా రెండు కూటములకు చెందని ఇతర పార్టీలే కీలకమని తేల్చిచెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సర్వే ప్రకారం…

రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్ తాజా సర్వే అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీలు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 16 టీఆర్‌ఎస్, 1 ఏఐఎంఐఎం గెలుచుకోనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ 19 సీట్లలో, టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కదని ఈ సర్వే అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఎన్డీఏ మళ్లీ రావాలనే 60 శాతం జనాభా కోరిక…

ఉత్తరాదిలో ఎన్డీయే బలంగానే ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 18% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు తేల్చాయి. యూపీఏ 43%, ఇతరులు 39% ఓట్లు సాధించే అవకాశం ఉంది. సీట్లపరంగా చూస్తే దక్షిణాదిలో యూపీయే 78 స్థానాల్లో నెగ్గుతుంది. తూర్పు రాష్ట్రాల్లో అధికార కూటమికి 37%, యూపీయేకి 25% ఓట్లు రావచ్చు. పశ్చిమ రాష్ట్రాల్లో ఎన్డీయేకి ఫలితాలు సానుకూలంగా ఉంటాయని సర్వేలు తేల్చాయి.

కాగా, మూడ్ ఆఫ్ ది సర్వే.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ రావాలని 60 శాతం దేశ జనాభా కోరుకుంటున్నట్లు తేల్చింది.

- Advertisement -