

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఈ ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా పెట్టారు.
ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కాశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది.
కట్టుదిట్టమైన భద్రత
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.








