మసూద్ అజార్ మా దేశంలోనే ఉన్నాడు, కానీ.: పాక్ అంగీకారం

masood-azhar
- Advertisement -

masood azhar

ఇస్లామాబాద్‌ : భారత్‌లో జరిగిన ముంబై 26/11, పుల్వామా లాంటి భారీ ఉగ్రదాడుల సూత్రదారి, జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ..‘‘అతడు (మసూద్‌) పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు’ అని వెల్లడించారు.

‘మసూద్‌ను పాక్‌ అరెస్ట్‌ చేయాలంటే.. ముందుగా భారత్‌ మాకు సరైన ఆధారాలు అందించాలి. అవి పాక్‌ న్యాయస్థానాలకు ఆమోదయోగ్యం కావాలి’ అని ఖురేషి చెప్పడం గమనార్హం. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

ఆధాలిస్తే చర్యలంటూ పాక్..

‘భారత్‌ వద్ద తగిన ఆధారాలు ఉంటే.. దయచేసి కూర్చుని చర్చించుకుందాం. చర్చలను ప్రారంభించండి. మేం సంసిద్ధంగా ఉన్నాం’ అని ఖురేషి వ్యాఖ్యానించారు. అయితే, 40 మందికిపైగా సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. కాగా, దాడులకు ఆ ఉగ్రవాద సంస్థే బాధ్యత వహించగా.. ఇంకేం సాక్ష్యం కావాలంటూ భారత్ పాకిస్థాన్‌పై మండిపడింది. ముంబై దాడుల కేసులో సాక్ష్యాలు ఇస్తే ఏం చేశారని నిలదీసింది.

చాలా ఏళ్ల నుంచి మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ కోరుతోంది. తాజాగా మసూద్‌‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మరోసారి ప్రతిపాదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వమున్న ఈ మూడు దేశాలూ బుధవారం దాని ముందుకు ఈ ప్రతిపాదనను తెచ్చాయి. ఇప్పటికే పలుమార్లు ఈ ప్రతిపాదనలకు మోకాలడ్డిన చైనా.. తాజాగా ఎలా స్పందిస్తుందో చూడాలి.

చదవండి: అభినందన్ తల్లిదండ్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం: వాఘాకు ప్రయాణం

- Advertisement -