రాజధాని ఇష్యూ: అమరావతిలో సకల జనుల సమ్మె…

amaravathi-capital-issue
- Advertisement -

అమరావతి: రాజధాని తరలింపు వివాదానికి సంబంధించిన నిరసన తారస్థాయికి చేరుకుంది. శుక్రవారం నుంచి అమరావతిలో సకల జనుల సమ్మెకు రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అమరావతిలోని 29 గ్రామాల్లో ఈ సమ్మె నిర్వహించనున్నట్లు, ఆయా గ్రామాల్లోని ప్రతి వ్యక్తి ఈ సమ్మెలో పాల్గొనాలని జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.

గత ఏడాది చివర్లో అసెంబ్లీ వేదికగా.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతుల నిరసనలకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి.

‘‘అవసరమైతే జోలె పట్టి నిధులు సేకరిస్తాం..’’

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి అమరావతిలో సకల జనుల సమ్మె కూడా మొదలవబోతోంది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే రైతులే జోలె పట్టి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తారని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు. అవసరమైతే రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి వచ్చిన డబ్బుతో రాజధాని నిర్మాణం చేపట్ట వచ్చని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని వారు పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి ప్రారంభమవుతోన్న సకలజనుల సమ్మెకు ప్రజలంతా సహకరించాలని, వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయకుండా ఉద్యోగులు కూడా తమకు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేయగా, శుక్రవారం ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ కూడా నివేదికను అందజేయనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని కూడా నియమించింది. దీనిలో మంత్రులతోపాటు అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.

ఇక గత ఏడాది చివర్లో జరిగిన కేబినెట్ భేటీలోనే రాజధాని అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగినా.. ఆ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మంత్రులతో మాట్లాడుతూ రాజధాని అంశంపై తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఈ నెల 8న జరిగే కేబినెట్ భేటీలో.. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -