
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం నెలకొన్న గందరగోళం నేపథ్యంలో తన వైఖరి ఏంటన్నది బీజేపీ స్పష్టం చేయనుంది. ఈ నెల 4న బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంలో తమ పార్టీ వైఖరి ఏంటన్నది ఆయన స్ఫష్టం చేస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
అమరావతి అంశంపై కేంద్రం ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను కూడా సునిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం.ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రం పాత్ర అంతగా ఉండదని, అది ఆయా రాష్ట్రాల అంతర్గత విషయమని పేర్కొన్నారు.
‘‘కేంద్రానికి ఆ హక్కు ఉంటుంది..’’
అయితే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అమరావతి నిర్మాణంలో కేంద్రం పాలుపంచుకుంటోందని, ఇప్పుడు అకస్మాత్తుగా దానిని తరలిస్తుంటే ప్రశ్నించే హక్కు కేంద్రానికి ఉంటుందని చెబుతున్నారు.
పార్టీలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండడంతో స్పష్టత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 4న కడపలో పర్యటించనున్న నడ్డా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి చర్చకు ఫుల్స్టాప్ పెడతారని నేతలు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇచ్చింది. రింగ్‌రోడ్, ఎక్స్‌ప్రెస్ హైవేలకు ఆర్థిక సాయం చేసింది. వివిధ ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
ఇన్ని జరిగిన తర్వాత రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోవడం సరైంది కాదని రాష్ట్ర నేతలు వాదిస్తున్నారు. అంతేకాక, అమరావతిని రాజధానిగా ఖరారుచేసే విషయమై అప్పటి సీఎం చంద్రబాబు సంప్రదించినప్పుడు కాంగ్రెస్, వైసీపీలతోపాటు బీజేపీ కూడా అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు.
రాజధాని విషయంలో తమ ప్రమేయం ఉండదని కేంద్రం చెప్పడం సరైంది కాదని, స్పష్టమైన వైఖరి తీసుకుని తమకు మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇద్దరూ ఒకే మాటపై ఉండగా, జీవీఎల్ మరోలా మాట్లాడుతున్నారు.
ఫలితంగా రాజధాని అంశంలో పార్టీలో విభేదాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, కాబట్టి రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.








