ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠా ఆదివారం బాథ్యతలు స్వీకరించారు. ఈయన మే 31, 2019 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత చీఫ్ సెక్రెటరీ దినేశ్ కుమార్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా ప్రభుత్వం అనిల్ చంద్ర పునేఠాను ఖరారు చేసింది.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్ర తొలుత రాజంపేట సబ్ కలెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించి.. ఆ తరువాత పలు హోదాల్లో పనిచేశారు. చీఫ్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ.. ఐఏఎస్‌గా తాను 34 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేశానని, సీఎస్ పదవి ఒక ఛాలెంజ్ లాంటిదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. కొత్త సీఎస్‌గా నియమితులైన అనిల్ చంద్రను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలియజేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయన్ని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.