25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home టెలివిజన్ బిగ్‌బాస్ ఫైనల్ రిజల్ట్: విజేతగా నిలిచిన కౌశల్ మండా, రన్నరప్‌గా గీతా మాధురి

బిగ్‌బాస్ ఫైనల్ రిజల్ట్: విజేతగా నిలిచిన కౌశల్ మండా, రన్నరప్‌గా గీతా మాధురి

nani-kaushal-venkatesh
- Advertisement -

big-boss-2-winner

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణాలవి. బుల్లితెర ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసిన బిగ్‌బాస్ తెలుగు2 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే వేదికపై విజేతను ప్రకటించగానే కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈ రియాలిటీ షో విజేతను ప్రకటించడానికి ప్రత్యేక అతిథిగా విక్టరీ వెంకటేష్ వేదికపై ప్రత్యక్షం అయి తీవ్ర ఉత్కంఠ నడుమ బిగ్‌బాస్ తెలుగు2 రియాలిటీ షో విజేతగా కౌశల్ మండాను ప్రకటించారు. రన్నరప్‌గా సింగర్ గీతామాధురి నిలిచారు.

ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే లైవ్‌లో.. తొలుత టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో సామ్రాట్ నిష్క్రమించగా.. ఆ తరువాత దీప్తి నల్లమోతు, తనీష్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చారు.

టైటిల్ రేసులో.. ఆ ఇద్దరు…

బిగ్‌బాస్ తెలుగు 2 ఫైనల్ రేసులో టాప్ ఫైవ్ నుంచి దీప్తి, సామ్రాట్, తనీష్ బయటికి వెళ్లిపోగా టైటిల్ పోరులో కౌశల్, గీతామాధురిలను వేదికపై నుంచి వెంటబెట్టుకుని హోస్ట్ నాని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లారు. లోపల ఇల్లంతా కలియదిరిగి మళ్లీ వారిని తీసుకుని ప్రధాన ద్వారం నుంచి వేదికపైకి వచ్చారు.

వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ…

దీంతో వారిద్దరిలో ఎవరిని విజేతగా ప్రకటిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అంతలో వేదికపైకి హీరో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ కూడా చాలా ప్రత్యేకంగా సాగింది. బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను ప్రకటించడానికి నాని ప్రయత్నిస్తుండగా.. వెంకటేష్ గొంతు వినిపించింది. ఎవరు? అని నాని ప్రశ్నించగా.. ఐదో తరగతిలో నీ ఫేవరెట్ సినిమా ఏంటి? అన్న ప్రశ్న వినిపించింది. ‘బొబ్బిలిరాజా’ అని నాని చెప్పగానే.. మరోప్రశ్న.

ఆరో తరగతిలో నీ ఫేవరెట్ సినిమా ఏంటీ అని. ‘కూలీ నంబర్ 1’ అని నాని జవాబివ్వగానే.. మళ్లీ ఏడో తరగతిలో అంటూ ప్రశ్న. ‘క్షణక్షణం’ అని సమాధానం చెప్పిన నానికి అర్థమైపోయింది.. ఆ ప్రశ్నలు  వేస్తున్నదెవరో అని. వెంటనే గ్రాండ్ వెల్‌కమ్ అంటూ హోస్ట్ నాని.. వెంకటేష్‌ను సాదరంగా  ఆహ్వానించడం ఆయన వేదికపైకి రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. వెంకటేష్ వచ్చీరావడంతోనే వేదికపై నిలిచిన కౌశల్, గీతామధురికి అభినందనలు తెలియజేశారు.

విజేతను ప్రకటించిన వెంకటేష్…

బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను ప్రకటించమని హోస్ట్ నాని అడగ్గా.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో నాని జర్నీని చూపించమని వెంకటేష్ అడగడం.. ఆ వెంటనే నాని లైఫ్ జర్నీకి సంబంధించిన వీడియో చూపించడం చకచకా జరిగిపోయాయి. ఆ వీడియో కూడా అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. ఆ తరువాత విజేతను ప్రకటించడానికి ప్రయత్నించిన నాని.. నా వల్ల కాదంటూ వెళ్లిపోయాడు.

దీంతో వెంకటేష్ వేదికపై నిలిచిన కౌశల్, గీతామాధురిలలో.. కౌశల్ చేయి పట్టుకుని పైకెత్తి విజేత అంటూ ప్రకటించడానికి ప్రయత్నించి మళ్లీ కుదరదు అంటూ కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఈలోగా హోస్ట్ నాని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 రియాలిటీ షో విజేత కౌశల్ అంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా కౌశల్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. అనంతరం ప్రేక్షకుల్లోకి వెళ్లి అక్కడ కూర్చున్న తన తండ్రిని కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు.

‘రన్నరప్‌’గా గీతామాధురి…

విజేతగా కౌశల్‌ను ప్రకటించడంతో గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత గీతామాధురి లైఫ్ జర్నీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. ఆ సమయంలో ఆమె కూడా ఉద్వేగానికి గురైంది.

ప్రైజ్ మనీ రూ.50 లక్షలు…

బిగ్‌బాస్ తెలుగు సీజన్2 విజేతగా రూ.50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్న కౌశల్ మండా మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో జీరోతో అడుగుపెట్టాను. అంచెలంచెలుగా ఎదుగుతూ బిగ్‌బాస్ విజేతగా నిలిచాను. ముందుగా నేను ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇక నాకు లభించిన
రూ.50 లక్షల ప్రైజ్ మనీని మా అమ్మ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాను. ఎందుకంటే, మా అమ్మ క్యాన్సర్‌తో మరణించారు. ఏ తల్లీ ఈ వ్యాధితో బాధపడకుండా ఆ డబ్బును ఉపయోగిస్తాను..’’ అని చెప్పారు.

అంతేకాదు.. ‘‘నేను విజేతగా నిలవడానికి ప్రధాన కారణం నా తోటి సెలబ్రిటీలే. వాళ్లు నాకు గట్టి పోటీ ఇవ్వకపోతే నాలో ఇంత కసి పెరిగేది కాదు.. వాళ్లందరి వల్లే విజేతగా నిలవాలని నేను మరింత కసిగా ప్రయత్నించాను..’’ అని కౌశల్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్ నుంచి విజేతగా బయటికొచ్చిన కౌశల్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -