అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రముఖ సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ప్రశ్నించలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలన్నీ కలిసి ప్రజలకు కుల గజ్జిని అంటించాయని, ప్రజలంతా ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

అమరావతి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితే రేపు విశాఖపట్టణం, కర్నూలు రైతులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక తప్పు చేసి ఉంటే, ఆయనను మాత్రమే శిక్షించాలని, కానీ ఏకంగా రాష్ట్రాన్ని మొత్తం శిక్షించడం ఎంతవరకు సమంజసమని శివాజీ సూటిగా ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా రాజధానిని జగన్ విశాఖకు తరలించడం తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం మారితే పోలవరం పూర్తికాదని, అమరావతి ఉండదని ఎన్నికలకు ముందే నెత్తీనోరు బాదుకుని చెప్పానని శివాజీ గుర్తు చేశారు. అయినా సరే పట్టించుకోకుండా జగన్‌కు 151 సీట్లు ఇచ్చి గెలిపించారని అన్నారు. ఇప్పుడు జగన్ ఇలా చేయడంలో ఎంతమాత్రమూ తప్పులేదని, తప్పంతా ప్రజలేదనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అన్ని వనరులు ఉన్న, అందరికీ అనుకూలత ఉన్న రాజధాని కావాలని, అది ఒక్క అమరావతి మాత్రమేనని శివాజీ పేర్కొన్నారు.

ప్రజల మధ్య ఐక్యత లేదని గుర్తించిన పార్టీలు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని అన్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదన్నారు. హోదా గురించి, కేంద్రం నెరవేర్చాల్సిన హామీల గురించి మాట్లాడితే తమను విజయవాడలో అడుగుపెట్టనివ్వలేదన్నారు. జగన్‌ గెలిచిన తర్వాత హోదా విషయం అటకెక్కిందని, అయినా ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.

రాజధాని తరలిపోతుంటే 29 గ్రామాల రైతులు మాత్రమే బాధపడుతున్నారని, వారికి ఎవరూ అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, నందిగామ, ఒంగోలు తదితర ప్రాంతాల రైతులు, ప్రజలు ఏం చేస్తున్నారని, వారు ఎందుకు పోరాడడం లేదని శివాజీ ప్రశ్నించారు. దీనికి కేసుల భయం, కులం అడ్డంకులు, ప్రాంతంపై మమకారం లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ఇదే భయం అప్పట్లో తెలంగాణ ప్రజలకు ఉండి ఉంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదే కాదని శివాజీ వివరించారు.

- Advertisement -