ట్రంప్ తీవ్ర అసహనం, మైక్రోఫోన్ లాక్కుని.. శ్వేతసౌధం నుంచి రిపోర్టర్‌ను గెంటేసి, ఎందుకంటే…

White House Suspends CNN Reporter Jim Acosta Press Pass1
- Advertisement -

White House Suspends CNN Reporter Jim Acosta Press Pass

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌కు గట్టి షాక్‌ తగిలింది. వాషింగ్టన్‌లో బుధవారం వెల్లడైన ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల సభలో పైచేయి సాధించగా.. రిపబ్లికన్లు సెనేట్‌లో తన ఆధిపత్యం నిలుపుకొన్నారు.

అయితే ఈ ఫలితాలతో కంగుతిన్న డొనాల్డ్‌ ట్రంప్‌‌ మళ్ళీ మీడియాను టార్గెట్‌ చేశారు. మీడియా తమ పార్టీపై సాగిస్తోన్న తప్పుడు ప్రచారమే తమ పార్టీ ఓటమికి కారణమని పరోక్షంగా ఆయన విమర్శించారు. ఈ క్రమంలో సీఎన్‌ఎన్‌ జర్నలిస్టు జిమ్‌ అకోస్టా వైట్‌హౌస్ ఎంట్రీ ప్రెస్‌పాస్‌ను రద్దు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌ జిమ్‌ అకోస్టా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అమెరికా వలసదారులపై డొనాల్డ్‌ ట్రంప్‌‌ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ.. ఇది ఒకరమైన దాడే కదా అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌‌‌పై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

దీంతో సహనం కోల్పోయిన ట్రంప్‌‌.. ‘‘నిజం చెప్పనా. అధ్యక్షుడిగా నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు వార్తా సంస్థను సవ్యంగా నడిపించుకోండి. అలాగే రేటింగ్స్‌ను పెంచుకోండి..’’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలో మరో ప్రశ్న అడిగేందుకు అకోస్టా సిద్ధమవుతుండగా.. ‘కూర్చో.. అతడి నుంచి మైక్రోఫోన్‌ లాక్కోండి..’ అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌‌ జిమ్‌ అకోస్టాపై అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం జిమ్‌ అకోస్టా మరోసారి వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. వైట్‌హౌస్ ఎంట్రీ  ప్రెస్‌పాస్‌ రద్దు అయిన కారణంగా మిమ్మల్ని లోపలికి అనుమతించలేం అంటూ సెక్యూరిటి సిబ్బంది పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఫ్యూచర్‌ నోటీసు అందేంత వరకు మరలా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే వీలులేదని వైట్‌హౌస్ వర్గాలు జిమ్‌ అకోస్టాకు సూచించాయి.

- Advertisement -