సిడ్నీ: డ్రైవర్ లేకుండానే ఓ రైలు కదిలింది. అలా ఒకటో.. రెండో కిలోమీటర్లు కాదు.. ఏకంగా 92 కిలోమీటర్లు ప్రయాణించింది. అది కూడా 110 కిలోమీటర్ల వేగంతో.. ఆ తరువాత పట్టాలు తప్పి పడిపోయింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పిబరా ప్రాంతంలో జరిగింది. ఇది గూడ్సు రైలు కావడంతో ప్రాణ నష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు చెబుతున్నారు.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్‌ల్యాండ్‌కు ఈ గూడ్సు రైలు బయలుదేరింది. నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లుతో దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రైలులో భారీ మొత్తంలో ఇనుప ఖనిజాన్ని తీసుకెళుతోంది.
డ్రైవర్ దిగి పరీక్షిస్తుండగా…
సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో పోర్ట్ హెడ్ ల్యాండ్‌కు 210 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. డ్రైవర్ రైలును ఆపి కిందకు దిగి ఓ వ్యాగన్‌ను పరీక్షిస్తున్నాడు. అంతలో రైలు దానంతట అదే ముందుకు కదిలింది. అలా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో 92 కిలోమీటర్లు ప్రయాణించి.. పోర్ట్ హెడ్ ల్యాండ్‌కు 119 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పట్టాలు తప్పి పడిపోయింది.
ఈ గూడ్సు రైలును నియంత్రించేందుకు సంబంధిత అధికారులు ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉదయం 5.05 ప్రాంతంలో కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పి పడిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో సుమారు 1500 మీటర్ల మేర పట్టాలు ధ్వంసమయ్యాయి.
ఈ గూడ్సు రైలు ప్రమాదం కారణంగా మిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం బీహెచ్‌పీ అంచనా వేస్తోంది. పాడైపోయిన రైలు మార్గాన్ని పునర్నిర్మించేందుకు మూడు నాలుగు రోజులు పడుతుందని తెలిపింది.