హైదరాబాద్: అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్ పైనుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మెట్రో స్టేషన్ మొదటి అంతస్తు నుంచి పక్కనే ఉన్న సారథి స్టూడియో ప్రహారీ గోడ వైపు అ వ్యక్తి దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు.
ఈ వారంలో ఇది రెండో ఘటన…
ఇలా మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం ఈ వారంలో ఇది రెండో సంఘటన. మంగళవారం కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి స్వప్న(25) అనే మహిళ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.
స్వప్న ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెకి ప్రమాదమేమీ లేదని, చేయి మాత్రం విరిగిందని ఉస్మానియా వైద్యులు తెలిపారు.