22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం పాక్ విమాన ప్రమాదం: ఫ్లైట్ కూలిపోక ముందు ఏం జరిగిందంటే.., వివరించిన ప్రయాణికుడు

పాక్ విమాన ప్రమాదం: ఫ్లైట్ కూలిపోక ముందు ఏం జరిగిందంటే.., వివరించిన ప్రయాణికుడు

pia-plane-8303-crash-survior-muhammad-zubair
- Advertisement -

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతూ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 97 మంది మరణించగా.. ఇద్దరు మాత్రమే బతికి బయటపడ్డారు.

ప్రమాదం జరిగేటప్పటికి విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 99 మంది ఉన్నారు.  మరోవైపు విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరిలో ఒకరు బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో జఫర్ మసూద్ కాగా, మరొకరు మహ్మద్ జుబేర్ అనే వ్యక్తి.

ప్రస్తుతం జుబేర్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో ఆయన మీడియాకు వివరించారు.

దుర్ఘటన ఎలా జరిగిందో.. జుబేర్ మాటల్లోనే…

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)‌కు చెందిన 8303 విమానం లాహోర్ నుంచి బయలుదేరి ఎలాంటి ఆటంకం లేకుండానే కరాచీకి చేరుకుంది. 

విమానంలో నా సీటు 8ఎఫ్. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపానికి రాగానే పైలట్ మా అందరినీ సీటు బెల్టు పెట్టుకోవాల్సిందిగా సూచించారు.

అందరం సీటు బెల్ట్ బిగించుకున్నాం. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మూడుసార్లు విమనం కుదుపునకు గురైంది. ఈలోగా రన్‌ వే వచ్చేసింది.

ఆ తరువాత ఏమైందోగానీ.. ఉన్నట్లుండి విమానం మళ్లీ గాల్లో పైకి లేచింది. పది, పదిహేను నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మేమంతా గాభరా పడ్డాం. 

ఈలోగా మళ్లీ పైలట్ కంఠస్వరం వినిపించింది. మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేస్తున్నట్లు మైక్‌లో చెప్పారు. 

ఆ ప్రకటన వినిపిస్తుండగా.. అసలెక్కడ ఉన్నామా అని నేను కిటికీలోంచి కిందికి చూశాను. మాలిర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నట్లు అర్థమైంది. 

అంతలోనే ఏం జరిగిందో తెలియదు.. పెద్ద శబ్దం వినిపించింది. నేను స్పృహ కోల్పోయాను. తిరిగి కళ్లు తెరిచి చూసే సరికి భీతావహ వాతావరణం కళ్లకు కనిపించింది. 

విమానం కూలిపోయిందని నాకు అర్థమైంది. చుట్టూ చూస్తుంటే.. దట్టమైన పొగ.. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బతికారో తెలియదు. 

- Advertisement -